Rythu Kooli Sangam
-
పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి..
ఏలూరు (టూటౌన్): కేంద్రంలో, రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్న పాలకులంతా రైతాంగ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంకేఎస్ కన్వీనర్ సుబోధ్విుత్రా పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శనివారం ఏలూరులో ప్రారంభమయ్యాయి. సుబోధ్ మిత్రా ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో ముందుగా రైతు కూలీ సంఘం పతాకాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆవిష్కరించారు.అనంతరం సుబోధ్ మిత్రా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల గ్రామాలు భూస్వాముల పీడన నుంచి విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసుకున్నారని గుర్తు చేశారు. దున్నేవాడిదే భూమి హక్కు కేంద్ర విధానంగా దేశంలో బలమైన రైతాంగ ఉద్యమం సాగాలన్నారు. అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరుతో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తరిమేసి గనుల తవ్వకానికి, సహజ సంపదల దోపిడీకి కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను పాలకులు వేగిరం చేస్తున్నారని, వీటిపై అవిశ్రాంత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ 1937 జూలైలో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకూ సాగించిన రైతు రక్షణ యాత్రకు నాయకత్వం వహించిన జిల్లా రైతులు కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి దంతులూరి వర్మ.. గత మహాసభల నుంచి ఇప్పటి వరకు సాగిన రైతాంగ ఉద్యమంలో అమరులైన 750 మందికి జోహార్లు అర్పిస్తూ తీర్మానం చేశారు.ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రైతుల హక్కుల సాధనకు ప్రాణాలైనా అర్పించి పోరాడాలని పిలుపునిచ్చారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న హత్యాకాండలో మరణిస్తున్న వారికి మహాసభ సంతాపం తెలియజేసింది. ఏఐఎఫ్టీయూ(న్యూ) జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్‌బాబు, ఏఐకేఎంకేఎస్ ఒడిశా నేత శ్రీకాంత్ మొహంతి, తెలంగాణ నేత ప్రసాదన్న, కర్ణాటక నేత చాగనూరు మల్లికార్జునరెడ్డి, ఆహ్వాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
బీడు భూములు సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు వర్షాధారంపై మాత్రమే ఆధారపడుతూ వ్యవసాయం చేసుకునే భూములు లేదా ఏ వనరులు లేక బీడుగా ఉండిపోయిన ఆరు లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వాటర్ షెడ్ల నిర్మాణం ద్వారా కొత్తగా సాగులోకి తీసుకురాబోతోంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 59 మండలాల పరిధిలో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అక్కడే నిల్వ ఉంచేలా రూ.555.31 కోట్లతో వాటర్షెడ్ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. ఈ ఖర్చును 60–40 నిష్పతిలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే మొత్తం 310 గ్రామ పంచాయతీల పరిధిలోని దాదాపు ఐదు లక్షల రైతు కుటుంబాలకు సంబంధించిన 6,03,938 ఎకరాలకు (2,44,405 హెక్టార్లు) సాగునీటి వసతి మెరుగుపడుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి అధికారులు వెల్లడించారు. అంతేకాక.. ఆయా గ్రామాల్లో మరో రెండు లక్షల దాకా రైతు కూలీ కుటుంబాలకు ఆదాయ మార్గాలు పెరిగేలా వివిధ రకాల జీవనోపాధుల కల్పనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించనుంది. ఫలితాల సాధనే ధ్యేయంగా.. వాటర్షెడ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వినూత్న ఫలితాల సాధనే ధ్యేయంగా చేపట్టబోతోంది. వాటి నిర్మాణ సమయంలోనే ఆయా గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం మేరకు బీడు, బంజరు భూములకు సాగునీరు వసతి మెరుగుపడుతుందా లేదా అన్నది పరిశీలన, సమీక్షలు చేసుకుంటూ రెండు నుంచి ఐదేళ్ల మధ్య కాలంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నది అంచనా వేశారు. అలాగే, సమగ్ర ప్రణాళిక (డీపీఆర్)లు కూడా అధికారులు సిద్ధంచేశారు. రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమీక్ష ఇక కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే భూ వనరుల (ల్యాండ్ రిసోర్స్) విభాగం అదనపు కార్యదర్శి హుకుంసింగ్ మీనా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సోమవారం తొలత సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతోనూ ఆయన భేటీ అవుతారు. -
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
భారత కమ్యూనిస్టు(మావోయిస్టు)పార్టీతో పాటు, అనుబంధ ఆరు సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పొడిగించిన నిషేధ ఉత్తర్వుల గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లపై నిషేధం విధిస్తూ ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పీకే.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.