మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
భారత కమ్యూనిస్టు(మావోయిస్టు)పార్టీతో పాటు, అనుబంధ ఆరు సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పొడిగించిన నిషేధ ఉత్తర్వుల గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎస్‌ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ), రైతు కూలీ సంఘం(ఆర్‌సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లపై నిషేధం విధిస్తూ ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పీకే.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.