Radical Student Union
-
మావోయిస్టు నేత లొంగుబాటు
మావోయిస్టు కీలక నేత ఒకరు రాయలసీమ ఐజీ శ్రీధర్రావుసమక్షంలో కర్నూలులో లొంగిపోయాడు. ఐజీ తెలిపిన వివరాలివీ.. వైఎస్సార్ జిల్లా గడ్డవారిపల్లె గ్రామానికి చెందిన గజ్జల కృష్ణారెడ్డి అలియాస్ రమణారెడ్డి మావోయిస్టు పార్టీ రాయలసీమ కమిటీ క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈయన కడప జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఈయన ఎమర్జెన్సీ సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేశారు. ఆ సంఘంలో అనేక కీలక బాధ్యతలను చేపట్టారు. ఈయన తండ్రి చెన్నారెడ్డి కూడా కమ్యూనిస్టు నాయకుడే. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని వదిలి తీవ్రవాదం వైపు మొగ్గుచూపారు. విజయనగరం, విశాఖపట్టణం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో చేపట్టిన అనేక ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవటంతో ఆయన లొంగుబాట పట్టారు. ఈయనపై వివిధ నేరాల కింద పది కేసులున్నాయి. ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ సొమ్మును ఆయనకు ఇస్తామని ఐజీ తెలిపారు. గురువారం తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేశారు. -
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం
భారత కమ్యూనిస్టు(మావోయిస్టు)పార్టీతో పాటు, అనుబంధ ఆరు సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పొడిగించిన నిషేధ ఉత్తర్వుల గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లపై నిషేధం విధిస్తూ ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పీకే.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.