‘కంతనపల్లి’కి అడ్డుగోడలా నిలబడాలి : వట్టం ఉపేందర్
ఏటూరునాగారం : ఆదివాసీ గూడాలను, ఆదివాసేతర ప్రజలను జల సమాధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒడిగడుతున్నాయని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ అన్నారు. కంతనపల్లి వ్యతిరేక పోరాట మన పాదయాత్ర ఈనెల 9న తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మొదలై.. తుపాకులగూడెంలో ముగిసింది. ఈ మేరకు ఆదివారం ఏటూరునాగారం మండలం కంతనపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభకు ఆదివాసీ రాష్ట్ర నాయకులు, కేయూ ప్రొఫెసర్‌లు హాజరై ప్రసంగించారు. ముందుగా గిరిజన నృత్యాలతో పాదయాత్ర విద్యార్థులను గ్రామస్తులు, నాయకులు స్వాగతించారు.
అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ.. ఐదో షెడ్యూల్డ్ ప్రకారం కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అర్హతలు లేవన్నారు. రాజకీయ నాయకుల స్వాలాభాల కోసం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం పేరిట రూ.9,574 కోట్లు మింగారని, దీనంతటికీ కేవీపీ రాంచందర్ సూత్రధారని మండిపడ్డారు. దేవాదుల పేరిట మిం గిన నిధులు సరిపోక రాజకీయ నాయకులు కంతనపల్లితో జేబులు నింపుకోవడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.
ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు దబ్బగట్ల సుమన్ మాట్లాడుతూ.. బహుళ జాతి కంపెనీలకు ఖనిజాలు, బొగ్గు, సహజ వనరులను దోచిపెట్టడానికి ప్రజాప్రతినిధులు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారన్నారు. ఖనిజ సంపదను దోచుకెళ్లడానికి పన్నాగం పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ.. కంతనపల్లి ప్రాజెక్టు ఒక్క పునాది రాయిని కూడా వెయ్యనియవద్దన్నారు. ప్రాజెక్టుకు ఆదివాసీలు అడ్డుగోడలా నిలవాలని పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఉద్యమ స్ఫూర్తితో కంతనపల్లి ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు.
తెలంగాణ ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఆనాడు ఆజాంజాయి మిల్‌ను మూసేసి.. నేడు కమలాపురం బిల్ట్‌ను అదే తరహాలో మూసివేయడానికి ప్రభుత్వాలు, యజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ఉపాధి లేని వ్యక్తి లేడన్నారు. కానీ ప్రభుత్వాల స్వార్థాల కోసం తెలంగాణ ప్రజలను అన్యాయం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మంకిడి బుచ్చయ్య, ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ ఆప్క నాగేశ్వర్‌రావు, విరసం నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్, గిరిజన జాక్ కన్వీనర్ జైసింగ్ రాథోడ్, తుడుందెబ్బ నాయకులు గొంది సత్యనారాయణ, రమణాల లక్ష్మయ్య, పోడెం బాబు, మల్లెల రాంబాబు, చెరుకుల ధర్మయ్య, కోటి రవి, చంద రంఘుపతి, రాఘవరావు, పోడెం రత్నం, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు నల్లెల రాజయ్య, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూర్క యాదగిరి, తాడ్వాయి జెడ్పీటీసీ పులసం సరోజన, ఆదివాసీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఆదివాసీలపై ప్రభుత్వాల కుట్ర
Published Mon, Nov 17 2014 3:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement