
కొచ్చి: ఆహారం దొంగలించినందుకు ఆదివాసి యువకుడు మధును కొట్టిచంపిన ఘటనపై కేరళ హైకోర్టు స్పందించింది. ఈ ఘటనపై సమోటో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేరళలోని అత్తపడిలో కేవలం బియ్యం దొంగలించినందుకు ఒక గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. మతిస్థిమితం లేని ఆదివాసీ వ్యక్తి అయిన అతన్ని కట్టేసి దారుణంగా కొట్టడమే కాదు.. ఆ సమయంలో అతనితో సెల్ఫీ, సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. ఈ దారుణం ఒక్క కేరళనే కాదు యావత్ దేశాన్ని కుదిపేసింది.
ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (కెల్సా) ఇన్‌చార్జ్‌గా ఉన్న జస్టిస్ కే సురేంద్రమోహన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ‘మన సమాజానికి, రాష్ట్రానికి ఈ ఘటన సిగ్గుచేటు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల మనం సిగ్గుతో తలదించుకోవాలి’ అని లేఖలో సురేంద్రమోమన్ పేర్కొన్నారు. ఈ ఘటనలోని తీవ్రత దృష్ట్యా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా భావించి.. ఈ కేసును సుమోటోగా విచారించాలని కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటోనీ డొమినిక్ నిర్ణయించారు.
‘గిరిజన ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ సంస్థలు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. పేదరికం తగ్గించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు సైతం కృషి చేస్తున్నాయి. అయినా మధు ఆహారం దొంగలించే పరిస్థితులు ఏర్పడటం.. ప్రభుత్వ పథకాలు అంత సమర్థంగా అమలవ్వడం లేదని చాటుతున్నాయి. ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందేందుకు ఈ పథకాల్లో అవసరమైన మార్పులు చేయాల్సి ఉంది. ఇది సమాజానికి కళ్లు తెరిపించే ఘటన. సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సమీక్షించి..సమగ్ర మార్పులు చేయాల్సిన అవసరముంది’ అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment