షెడ్యూల్డ్ ఏరియాల్లో జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అంద జేయాల్సి ఉంటుంది. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు.
రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆదివాసీలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక నాయకురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. అలా జరిగితే ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది.
‘ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని అన్నింటి కన్నా ముఖ్యమైనది. అణగారిన వర్గాలకు సంబంధించి మనం కేవలం రిజర్వేషన్ల వరకే పరిమితమయ్యాం. కానీ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్క రించడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రపతికి శక్తి మంతమైన అధికారాలిచ్చే విధంగా ఈ ఆర్టికల్‌ను పొందుపరచాలి’’ అంటూ రాజ్యాంగ సభ సభ్యుడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ చేసిన వ్యాఖ్యలివి. భారత రాజ్యాంగ సభలో జూన్ 16, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పండిట్ భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రాజ్యాంగ ముసాయిదాలో 301 నంబర్‌తో ఉన్న ఆర్టికల్ రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రాజ్యాంగంలో 340గా పొందు పరి చారు. ‘‘భారత దేశంలో ఉన్న వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా విషయాలను పరిశోధించడానికి, పరిశీ లించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చును.’’ ఇది ఆర్టికల్ 340 సారం. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని పొందిన చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు.
పదవ రాష్ట్రపతిగా పనిచేసిన డా.కె.ఆర్.నారాయణన్ మినహాయింపు. 2000 జూలై 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, విని యోగం, దారిమళ్ళింపు సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలును గురించి అధ్యయనం చేయడానికి ఏడుగురు గవర్నర్లతో ఒక కమిటీని నియమించారు.
అప్పటి మహా రాష్ట్ర గవర్నర్ పి.సి. అలెగ్జాండర్ అధ్యక్షతన, మేఘాలయ గవర్నర్ ఎం.ఎం. జాకబ్, కేరళ గవర్నర్ ఎస్.ఎస్. కాంగ్, కర్ణాటక గవర్నర్ వీఎస్ రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాను, ఒడిషా గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, హరియాణా గవర్నర్ బాబు పరమా నంద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
2000 ఆగస్టు 8న ఏర్పడిన కమిటీ, 2001 ఏప్రిల్ 28న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో భూ పంపిణీ, విద్య, గృహ వసతి, ప్రజారోగ్యం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పథ కాలు, వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రగతిపైనా ఎన్నో సిఫారసులు చేసింది. నిజానికి స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అత్యున్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్లు అన్ని రాష్ట్రాలు తిరిగి, సంబంధిత మంత్రులు, అధికారులు, సామాజిక వర్గాల సంస్థలు, సంఘాలతో సమావేశం కావడం విశేషం.
అయితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోలేదు. కానీ ఈ కమిటీ ప్రయత్నం ఊరికేపోలేదు. ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కారం కోసం పనిచేసే సంస్థలకు ఒక ఆయుధమై నిలిచింది. ఎన్నో రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి.
ఈ విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. దక్షిణ భారతదేశ విడిది హైదరాబాద్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి మొదటిసారి ఉంటున్నారు. రాష్ట్రపతికి ప్రభుత్వా లను కాదని, మార్పులు చేయగలిగే అధికారం లేకపోయి ఉండవచ్చు. కానీ 339, 340 ఆర్టికల్స్ ప్రకారం, అదేవిధంగా 5వ షెడ్యూల్‌లో షెడ్యూల్ తెగల కమిటీల రక్షణ విషయంలో రాష్ట్రపతి అధికారాలను, చొరవను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిధిలో, అది అందించిన అధికారాలను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీల
సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ఒక ప్రధాన ఆదివాసీ తెగౖయెన సంథాల్ సమూహానికి చెందిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో నారాయణన్ చూపిన చొరవను చూపాలనే ఆకాంక్షతోనే వీటన్నింటినీ ప్రస్తావిం చాల్సి వస్తోంది.
మన రాజ్యాంగంలో ఆర్టికల్ 339 ప్రకారం, క్లాజు ఒకటి చెపుతున్న ఒక చట్టబద్ధమైన కమిషన్ ఇప్పటికే అమలులో ఉంది. ఆర్టికల్ 339 క్లాజు–2 కూడా రాష్ట్రపతికి ఎస్టీల సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన, సమీక్ష విషయాలలో అధికారాలను ఇచ్చింది. ‘‘రాష్ట్రాల్లో ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరును పరిశీలించి, వారికి తగు నిర్దేశకత్వం ఇవ్వవచ్చు’’ అనే క్లాజు ఒక ముఖ్యమైన అంశం.
అదేవిధంగా 5వ షెడ్యూల్ కేవలం ఆదివాసీల రక్షణకు ఉద్దే శించిన హక్కుల పత్రం. ఐదవ షెడ్యూల్‌లో పేర్కొన్న హక్కుల రక్షణలో రాష్ట్రపతి పర్యవేక్షణ ప్రధానమైనది. ఐదవ షెడ్యూల్ పార్ట్ (ఎ)లో పేర్కొన్న మూడవ అంశం గురించి ప్రస్తావించుకుందాం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలి. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, దేన్ని గురించి అడిగినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అందజేయాలని నిర్దేశించారు.
అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. తగు సూచ నలు, సలహాలు చేయవచ్చు. అదేవిధంగా పార్ట్(బి)లో 4వ అంశం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ)కు విస్తృతమైన అధికారాలున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా లన్నా, ఆదివాసీలకు సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నా, ట్రైబల్ అడ్వై జరీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పా టుకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. టీఏసీలో 20 మంది సభ్యులకు మించి ఉండ కూడదనీ, వీరిలో 3/4వ వంతు ఆ రాష్ట్ర ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలనీ నిబంధన కూడా ఉంది.
ఆదివాసుల హక్కుల కోసం అన్ని రకాల చట్టాల అమలును పర్యవేక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడడం టీఏసీ బాధ్యత. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అస్తిత్వం నామమాత్రంగానే మిగిలిపోవడవం బాధాకరం. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సలహా మండలిని పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల తీరుచూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సలహా మండళ్లను సంప్రదిస్తున్న దాఖలాలే లేవు.
ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత్ర కీలకమౌతోంది. ఒక మహిళగా, ఆదివాసీ బిడ్డగా, అడవిబిడ్డల పేగు తెంచుకొని పుట్టిన ఒక నాయకురాలిగా రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమా నతలు, సామాజిక వ్యత్యాసాలు ఆదివాసీలను మరింత వెనుకబాటు తనానికి గురిచేస్తున్నాయి.
ఆదివాసీల స్థితి గతులపై ఒక అధ్యయనం జరిపి, వారి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే, ద్రౌపది ముర్ములాంటి ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. అణచి వేతకు గురౌతున్న ఆయా వర్గాల ప్రాతినిధ్యం అక్షరాలా సరైనదని రుజువవుతుంది.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077
Comments
Please login to add a commentAdd a comment