
భద్రాద్రి జిల్లా రాళ్లాపురం నుంచి జట్టీ ద్వారా గర్భిణిని మోసుకొస్తున్న ఆదివాసీలు
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి.
మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment