సాక్షి, ఆసిఫాబాద్: లోక్‌సభ ఎన్నికల సంగ్రామంలో ఆదివాసీ ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో గిరిజన ఓట్లలో అత్యధికంగా ఆదివాసీ తెగలకు చెందిన ఓట్లే ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడనుంది. గత రెండేళ్లుగా ఆదివాసీలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడా సామాజిక వర్గాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. ఈ ఉద్యమ ప్రభావంతో అప్పట్లో ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి.
ఈ ఉద్యమాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుండి నడిపించింది. ఆదివాసీ హక్కుల కోసం అన్నింటా ముందుండే తుడుందెబ్బ ఎన్నికల ముందు ఆ సంఘం నాయకుల్లో చీలిక వచ్చింది. వేర్వేరు రాజకీయ కారణాలతో తుడందెబ్బ పెద్ద నాయకులంతా ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో చేరడంతో ఆదివాసీ ఉద్యమంతోపాటు ఎంపీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడనున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది.
పార్టీలు మారిన నాయకులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదివాసీ మెజార్టీ నాయకులు ఒకే పార్టీలో ఉండగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సమయంలో పార్టీలు మారడంతో ఆదివాసీ ఓట్లు ఎటువైపు వెళ్తాయానేది ఆసక్తికరంగా మారింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపు రావు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల తరఫున ఉన్న మరో కీలక నాయకుడు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
అలాగే కుమురంభీం జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కోట్నాక విజయ్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ జన సమితి పార్టీలో ఉన్నారు. మరికొంత మంది కిందిస్థాయి నేతలు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలో ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ సైతం ఆదివాసీ వర్గానికి చెందిన నాయకుడే కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు ఎటువైపు మళ్లుతాయనేది ఆసక్తిగా మారింది. వేర్వేరు పార్టీలో ఉన్న ఈ ఆదివాసీ నాయకులు తమ జాతి ఓట్లను ఎవరివైపు మలుచుకుంటారనే చర్చ సర్వత్రా సాగుతోంది.
రిజర్వు స్థానాల్లో మరింత కీలకం..
ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో సిర్పూర్, ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్ జనరల్ శాసన సభ నియోజకవర్గాలు ఉండగా మిగతా మూడు బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వు స్థానాలు ఉన్నాయి. వీటిలో మెజార్టీ ఓట్లు గిరిజనేతరులు ఉండగా రెండోస్థానంలో ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అందులో ఆదివాసీ ఓట్లే అధికంగా ఉన్నారు. రిజర్వు స్థానాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ఓటర్లు ఎటువైపు ఉంటారనే ఆసక్తి నెలకొంది. ఆదివాసీ నాయకుల్లోనే ఇద్దరు ప్రధాన నాయకులైన సోయం బాపురావు బీజేపీ నుంచి, టీఆర్‌ఎస్ నుంచి గొడం నగేశ్ పోటీలో ఉండడంతో ఆదివాసీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం లోక్‌సభ పరిధిలో అన్నింటా టీఆర్‌ఎస్ చెందిన ఎమ్మెల్యేలే ఉండడం నగేశ్‌కు కలిసొచ్చే అంశం. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉండడంతో పదికి పది టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నట్లు అయిపోయింది. ఇక బీజేపీ నుంచి బరిలో ఉన్న సోయం బాపూరావు పోటీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో బీజేపీ బలమైన కేడర్ లేకపోవడం ప్రధాన లోపం. పది నియోజకవర్గాల్లో ఎక్కడా ఎమ్మెల్యేలు లేరు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రమే రెండో స్థానంలో బీజేపీ ఉంది. నిర్మల్‌లో కాస్త పట్టు ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా పార్టీకి బలం లేకపోవడంతో ఆ పార్టీ గెలుపొందాలంటే ఆదివాసీ ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో గంపగుత్తగా పడితే గెలుపు సాధ్యం అవుతోంది. అయితే ఆదివాసీలంతా లోక్‌సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది లోక్‌సభ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment