votes majority
-
జస్ట్ మిస్.. కొద్దిలో గట్టెక్కింది వీరే.. భారీ మెజార్టీ వీళ్లదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్లాన్ జరుగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కొద్ది ఓట్ల మార్జిన్‌తో, భారీ మెజార్టీతో కొందరు అభ్యర్థులు విజయం సాధించారు. బొటాబొటీ ఓట్లతో గట్టెక్కింది వీరే.. చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్‌పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్లో గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,606, ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు. 20 మందికి 50వేలకుపైగా మెజారిటీ రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్ (బీఆర్ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. -
ఆదిలాబాద్‌లో... ఆదివాసీ ఎటు?
సాక్షి, ఆసిఫాబాద్: లోక్‌సభ ఎన్నికల సంగ్రామంలో ఆదివాసీ ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో గిరిజన ఓట్లలో అత్యధికంగా ఆదివాసీ తెగలకు చెందిన ఓట్లే ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడనుంది. గత రెండేళ్లుగా ఆదివాసీలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడా సామాజిక వర్గాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. ఈ ఉద్యమ ప్రభావంతో అప్పట్లో ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. ఈ ఉద్యమాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుండి నడిపించింది. ఆదివాసీ హక్కుల కోసం అన్నింటా ముందుండే తుడుందెబ్బ ఎన్నికల ముందు ఆ సంఘం నాయకుల్లో చీలిక వచ్చింది. వేర్వేరు రాజకీయ కారణాలతో తుడందెబ్బ పెద్ద నాయకులంతా ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో చేరడంతో ఆదివాసీ ఉద్యమంతోపాటు ఎంపీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడనున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీలు మారిన నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదివాసీ మెజార్టీ నాయకులు ఒకే పార్టీలో ఉండగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సమయంలో పార్టీలు మారడంతో ఆదివాసీ ఓట్లు ఎటువైపు వెళ్తాయానేది ఆసక్తికరంగా మారింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపు రావు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల తరఫున ఉన్న మరో కీలక నాయకుడు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. అలాగే కుమురంభీం జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కోట్నాక విజయ్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ జన సమితి పార్టీలో ఉన్నారు. మరికొంత మంది కిందిస్థాయి నేతలు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలో ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ సైతం ఆదివాసీ వర్గానికి చెందిన నాయకుడే కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు ఎటువైపు మళ్లుతాయనేది ఆసక్తిగా మారింది. వేర్వేరు పార్టీలో ఉన్న ఈ ఆదివాసీ నాయకులు తమ జాతి ఓట్లను ఎవరివైపు మలుచుకుంటారనే చర్చ సర్వత్రా సాగుతోంది. రిజర్వు స్థానాల్లో మరింత కీలకం.. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో సిర్పూర్, ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్ జనరల్ శాసన సభ నియోజకవర్గాలు ఉండగా మిగతా మూడు బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వు స్థానాలు ఉన్నాయి. వీటిలో మెజార్టీ ఓట్లు గిరిజనేతరులు ఉండగా రెండోస్థానంలో ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అందులో ఆదివాసీ ఓట్లే అధికంగా ఉన్నారు. రిజర్వు స్థానాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ఓటర్లు ఎటువైపు ఉంటారనే ఆసక్తి నెలకొంది. ఆదివాసీ నాయకుల్లోనే ఇద్దరు ప్రధాన నాయకులైన సోయం బాపురావు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి గొడం నగేశ్ పోటీలో ఉండడంతో ఆదివాసీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం లోక్‌సభ పరిధిలో అన్నింటా టీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలే ఉండడం నగేశ్‌కు కలిసొచ్చే అంశం. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండడంతో పదికి పది టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నట్లు అయిపోయింది. ఇక బీజేపీ నుంచి బరిలో ఉన్న సోయం బాపూరావు పోటీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో బీజేపీ బలమైన కేడర్ లేకపోవడం ప్రధాన లోపం. పది నియోజకవర్గాల్లో ఎక్కడా ఎమ్మెల్యేలు లేరు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రమే రెండో స్థానంలో బీజేపీ ఉంది. నిర్మల్‌లో కాస్త పట్టు ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా పార్టీకి బలం లేకపోవడంతో ఆ పార్టీ గెలుపొందాలంటే ఆదివాసీ ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో గంపగుత్తగా పడితే గెలుపు సాధ్యం అవుతోంది. అయితే ఆదివాసీలంతా లోక్‌సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది లోక్‌సభ ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి. -
శభాష్..బండి
సైదాపురం(వెంకటగిరి), న్యూస్‌లైన్: సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజే ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న పంట కాలువల పూడిక సమస్యను ఒక రోజులో పరిష్కరించారు. రాజకీయాల్లో సైనిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారు ఈ విశ్రాంత సైనికాధికారి. సైదాపురానికి చెందిన బండి వెంకటేశ్వర్లురెడ్డి గతంలో సైన్యంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 230 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శనివారం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టారు. చెరువుకు నీరు అందించే ప్రధాన కాలువ పూడిపోవడంతో నీరు గ్రామంలోకి ప్రవేశించి వీధులు బురదమయం కావడం ఆయన దృష్టికి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండటంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంకటేశ్వర్లురెడ్డి మొదటి ప్రాధాన్యమిచ్చారు. మంగళవారం ప్రొక్లెయిన్ తెప్పించి సుమారు కిలోమీటర్ పొడవున కాలువలో పూడిక తీయించారు. ప్రొక్లెయిన్ వద్దే ఉండి సిబ్బందికి సూచనలిస్తూ సాయంత్రానికి పని పూర్తిచేయించారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లురెడ్డి చెప్పారు.