నిజామాబాద్‌లో 68 శాతం పోలింగ్‌ | Peacefully Polling Completed In Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో 68 శాతం పోలింగ్‌

Published Fri, Apr 12 2019 2:26 PM | Last Updated on Fri, Apr 12 2019 2:31 PM

Peacefully Polling Completed In Nizamabad - Sakshi

ఆర్మూర్‌ మండలం ఆలూర్‌లో..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌:  దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పోలింగ్‌ సజావుగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి  ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 68.10 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 15,52,838 మంది ఓటర్లకు గాను 10,57,483 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్‌పోలింగ్‌ ప్రక్రియను చేపట్టిన అధికారులు, 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు.

సాయంత్రం ఆరు గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. 185 మంది అభ్యర్థులు ఉండటంతో మాక్‌పోలింగ్‌కు అధిక సమయం పట్టింది. పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు కారణంగా ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. దీంతో తొలి గంట సమయం.. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 3.60 శాతమే పోలింగ్‌ నమోదైంది. 11 గంటల వరకు 13.80 శాతానికి చేరుకున్న పోలింగ్‌ తర్వాత  పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.10 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఎండ కారణంగా రెండు గంటల పాటు పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోయా యి. మధ్యాహ్నం 3 గంటల వరకు 45.29 శాతాని కి పెరిగింది.

మళ్లీ సాయంత్రం 4 తర్వాత పోలింగ్‌ పుంజుకుంది. 5 గంటల వరకు 54.20 శాతానికి చేరుకుంది. బాల్కొండ నియోజకవర్గం వడ్యాట్, సుంకెట్, నల్లూరు, కొడిచర్ల, హాసకొత్తూరు, జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ 6 గంటల తర్వాత కూడా పోలింగ్‌ కొనసాగింది. బోధన్‌ మండలం చెక్కి క్యాంపులో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్‌ జరిగింది.  జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ కార్తికేయ పరిశీలించారు. 

ఊపిరి పీల్చుకున్న అధికారులు 
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పోలింగ్‌ సజావు గా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రత్యేకంగా ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించి పోలింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు అధికారులు నిర్విరామంగా పనిచేశారు. కొందరు అధికారులు, సిబ్బంది రాత్రీపగలు తేడా లేకుండా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 12 బ్యాలెట్‌ యూనిట్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు., అదనపు పోలింగ్‌ సిబ్బంది.. ఇలా అన్ని రకాలుగా అదనపు ఏర్పాట్లు చేయాల్సి రావడంతో అధికారులు నిర్విరామంగా పనిచేయాల్సి వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ జరిగింది. 

స్ట్రాంగ్‌ రూంలకు ఈవీఎంలు.. 
పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్టాం గ్‌రూంలకు తరలించారు. డిచ్‌పల్లి మండలం సు ద్దపల్లిలోని సీఎంసీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంల లెక్కింపు ఈ సీఎంసీలో నిర్వహించాలని ని ర్ణయించారు. మిగిలిన కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్లను జగిత్యాలలో లెక్కించనున్నారు.   

ఓట్లేసిన అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు.. 
బరిలో నిలిచిన అభ్యర్థులు తమ కుటుంబసభ్యుల తో కలిసి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత తన కుటుంబసభ్యులతో కలిసి నవీపేట్‌ మండలం పోతంగల్‌లో ఓటు వేశారు. బీజేపీ అ భ్యర్థి ధర్మపురి అర్వింద్‌ తన సతీమణి ప్రియాంక తో కలిసి నగరంలోని కాకతీయ కాలేజీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నా రు. కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌ గంగాస్థాన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. వేల్పూర్‌ మండ ల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సతీమణితో కలిసి వచ్చి ఓటేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. 

పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు.. 
185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల సంఘం చరిత్రలోనే తొలిసారిగా ఎం–3 ఈవీ ఎంలతో పోలింగ్‌ నిర్వహించారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఇంజనీర్లు వాటిని సరిచేసి, పోలింగ్‌ను ప్రారంభించారు. భీంగల్‌ మండలం పల్లికొండ, బోధన్‌ మండలం సాలూర, నవీపేట్‌ మండలం పోతంగల్, ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి, ఆర్మూర్‌ మండలం పెర్కిట్, మోర్తాడ్‌ మండలం వడ్యాడ్, నందిపేట్, మెండోరా, ఇందల్వాయి, ధర్పల్లి, భీంగల్‌ మండల కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బోధన్‌ పట్టణంలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాలు, సిరికొండ మండలం చీమన్‌పల్లి, రావుట్లలో, నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని ఖానాపూర్‌లో, నందిపేట్‌ మండలం వెల్మల్, కుద్వాన్‌పూర్‌లలోనూ ఈవీఎంల మొరాయింపు కారణంగా కాస్త ఆలస్యంగా పోలింగ్‌ షురువైంది. మోపాల్‌ మండలం సిర్పూర్‌లో, మెండోరా మండలంలో వెల్గటూరు, డిచ్‌పల్లి మండలం సాంపల్లిలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే ఇంజనీర్లు సరిచేశారు.  

హాసకొత్తూర్‌లో 75మంది పోలింగ్‌ ఏజెంట్లు
175 మంది రైతులు బరిలో ఉండగా, పలు పోలిం గ్‌ కేంద్రాల్లో ఈ అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూర్‌ పోలింగ్‌బూత్‌లో 75 మంది ఏజెంట్లు పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా రైతులు ఉన్నారు. ఇదే గ్రామంలో మరో బూత్‌లో 35 మంది ఏజెంట్లు ఉన్నారు. అధిక సంఖ్యలో ఏజెంట్లు ఉండటంతో ఇక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌బూత్‌ బయట టెంట్లు, కుర్చీలు వేసి అందులో కూర్చోబెట్టారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. బాల్కొండ, ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని పోలింగ్‌ బూతుల్లోనే రైతు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. 

బెట్టు చేసిన చెక్కిక్యాంపు వాసులు.. 
బోధన్‌ మండలం తమ గ్రామాన్ని బోధన్‌ మున్సి పాలిటీలో విలీనం చేయవద్దని  చెక్కి క్యాంపు  గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలని మొదట నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరూ పోలింగ్‌కేంద్రానికి రాలేదు. దీంతో పలు పార్టీల అభ్యర్థులు వెళ్లి గ్రామస్తులకు సర్ది చెప్పడంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

నగరంలో స్వల్ప లాఠీచార్జి.. 
నిజామాబాద్‌ నగరంలో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీచార్జి చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement