జైపూర్: రాజస్థాన్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు వేరువేరుగా తమ సొంత అభ్యర్థులను ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ (BAP) చివరకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుని పొత్తు కుదుర్చుకున్నాయి.
సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌జీందర్ సింగ్ రంధావా "రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కాంగ్రెస్ ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. బన్స్వారా లోక్‌సభ స్థానంలో మద్దతు కోసం బీఏపీ అభ్యర్థి రాజ్‌కుమార్ రావత్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన గంటలోపే ఏప్రిల్ 4న నామినేషన్‌ను దాఖలు చేసిన కాంగ్రెస్‌కు చెందిన అరవింద్ దామోర్ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌తో సీట్ల పంపకంలో భాగంగా భారతీయ ఆదివాసీ పార్టీ బన్స్వారా, బగిదోర లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో గిరిజనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిత్తోర్‌గఢ్, జలోర్ నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
గిరిజనుల్లో గట్టి పట్టు
గుజరాత్‌లో 2017లో ఛోటుభాయ్ వాసవా భారతీయ గిరిజన పార్టీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే రావత్, రాంప్రసాద్ దిండోర్ రాజస్థాన్‌లోని చోరాసి, సగ్వాడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గెలిచిన తర్వాత వారు పార్టీని వీడారు. ఆ తర్వాత వీరిద్దరూ 2023 సెప్టెంబరులో మళ్లీ బీఏపీలోకి వచ్చారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. దాని అభ్యర్థులు మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులు రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్, బన్స్వారా దుంగార్‌పూర్, ఉదయపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన వాగడ్ ప్రాంతంలో కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ గిరిజన పార్టీకి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీలలో భారతీయ గిరిజన పార్టీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment