ఆదివాసి విద్యార్థి సంఘం పేరిట అసత్య ఆరోపణలు
Published Sat, Aug 6 2016 5:20 PM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
ఏయూ క్యాంపస్: మావోయిస్టు కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఆదివాసి విద్యార్థి సంఘం పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసత్య ప్రకటనలు చేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు డాక్టర్ ఎల్.మధు అన్నారు. శనివారం ఉదయం ఏయూ ఫ్యాకల్టీక్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమ సంస్థ మావోయిస్టులకు వ్యతిరేకంగా ఎటువంటి పోస్టర్లను విడుదల చేయలేదని వివరణ ఇచ్చారు. తమ సంస్థ కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రమే ఏర్పాటయిందని, పోలీసులకు, ప్రభుత్వానికి, మావోయిస్టులకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఉండే సంఘం కాదని స్పష్టం చేశారు. ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా మన్యంలో వెలసిన పోస్టర్లతో తమ సంస్థకు సంబంధం లేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.లోవరాజు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఆదివాసి విద్యార్థి సంఘంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన దుష్పచారం చేస్తున్నారన్నారు. దీనిని తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి టి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ తమకు రాజకీయ పార్టీతోను, మావోలతోను, పోలీసు వ్యవస్థలతోను ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను ఎవ్వరూ పరిగణించరాదని విజ్ఞప్తి చేశారు. ప్రతికా ముఖంగా ప్రభుత్వానికి, మావోయిస్టులకు, పోలీసులకు కూడా వాస్తవాలను తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యంగి ప్రసాద్, విద్యార్థులు బాబురావు, లక్ష్మణ్, మణికాంత్, ఎస్.టి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ధర్మారాయ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement