మావోలతో సంబంధాలంటూ దాడులు
ఆదివాసీలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాడులు
పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్
తొగుట: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదివాసీలే లక్ష్యంగా దాడులు చేయిస్తోందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తొగుటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ దేహగాం, టెంపర్ గ్రామాలకు చెందిన సిడాం శ్రీనివాస్, కుడిమేత సుగునయ్యను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్నారు. మాజీ సర్పంచ్ సోయం చెన్నన్నకు మావో కార్యదర్శి దామోదర్‌తో సంబందాలున్నాయని పోలీసులు ఆరోపిస్తూ వేధిస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా నార్లాపూర్‌కు చెందిన సిద్దబోరుున శివరాజ్ అనే యువకుడిని జైలుకు పంపించారని ఆవేదన చెందారు.
కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్మాణానికి 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలన్న హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ 123 జీఓతో భూసేకరణ చేస్తున్న అధికారులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని, అందుకే నిరుపేద రైతుల భూములు దౌర్జన్యంగా లాక్కుంటోందని ఆరోపించారు. అంతేగాక నల్లగొండ జిల్లా అంకపల్లి వద్ద ఒక్క టీఎంసీ రిజర్వాయర్ లీకేజీకి రిపేరు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని, అలాంటిది మైదాన ప్రాంతంలో 50 టీఎంసీలను నిల్వ సాధ్యం కాదన్నారు. పోడు భూములు లాక్కోవడంతో ఖమ్మం జిల్లా మరిగూడలో వెంకటేశ్వర్లు అనే ఆదివాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని లక్ష్మణ్ ఆరోపించారు.