
దాడిలో ధ్వంసమైన టీవీ ధ్వంసమైన బైక్ బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ ప్రకాశ్‌జాదవ్
చింతలపాలెం(హుజూర్‌నగర్) : మండలంలోని కిష్టాపురంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారి మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన ఆధిపత్య పోరు విధ్వంసానికి దారి తీసింది. ఈ దాడిలో పలువురి ఇళ్లు, తలుపులు, కిటికీలు, బైక్‌లు, టీవీలు ధ్వంసం అయ్యాయి. గడ్డి వాములను దహనం చేసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఇరువర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. దీంతో వారు పరస్పరం ఇళ్లపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈదాడిలో ఒక మహిళ చేతికి, మరొకరి తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు 12 మందికి చెందిన ఇళ్లలోని గృహోపకరణాలను ధ్వంసం చేశారు.
పలు ఇళ్లలోని తలుపులు, కిటికీలు, అద్దాలు, కుర్చీలు, ఫ్యాన్లు, మంచం, ఫ్రిజ్‌లు, రెండు టీవీలు, 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు. 7 చిన్న గడ్డి వాములను తగులబెట్టారు. రాత్రి సమయం కావడంతో ఎక్కడ ఏం జరిగిందో అర్థం కాని పరిస్ధితి నెలకొంది. విషయం తెలుసుకున్న చింతలపాలెం, మేళ్లచెరువు ఎస్‌ఐలు పరమేష్, సత్యనారాయణలు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. దాడులకు పాల్పడిన వారు గ్రామం నుంచి పరారయ్యారు. శుక్రవారం రాత్రి కిష్టాపురం గ్రామాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం కిష్టాపురం గ్రామాన్ని కోదాడ డీఎస్‌పీ రమణారెడ్డి, కోదాడ రూరల్ సీఐ రవి సంఘటనా స్ధలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. దాడుల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని మహిళలు, చిన్నారులు బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment