సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో కొత్త రాజకీయ చరిత్రను లిఖించేందుకు ఓ కొత్త శక్తి ఆవిర్భవించింది. ఇప్పుడది తన లక్ష్య సాధన దిశగా పురోగమిస్తోంది. అది పాలక పక్ష బీజేపీకి చెమటలు పోయిస్తుండగా, మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఆ శక్తి పేరే ‘జాయ్స్ (జేఏవైఎస్)’. అంటే, జై ఆదివాసి యువ శక్తి. 2009లో ‘ఫేస్‌బుక్’ పేజీ ద్వారా పుట్టుకొచ్చిన ఈ సంస్థ ప్రజల్లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చి నేడు ‘మాల్వా–నిమర్’లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించింది. వెనకబడిన వర్గాల ప్రాబల్య ప్రాంతమైన మాల్వా–నిమర్‌లో 66 అసెంబ్లీ సీట్లకుగాను 28 సీట్లకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంది. వాటిలో 22 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన స్థానాలే కావడం గమనార్హం.
రాష్ట్రంలో 22 శాతం జనాభా కలిగిన ఆదివాసీలను అనాదిగా అగ్రవర్ణాలు అణచివేస్తున్నా, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న కసితో కొంత మంది ఆదివాసీ విద్యార్థులు తమ సొంత గొంతును వినిపించేందుకు 2009లో ‘యువ శక్తి బిలాల’ పేరుతో ఓ ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు. అది కాస్త 2011లో ‘జై ఆదివాసీ యువ శక్తి’గా మారింది. దాన్ని ఆదివాసీ విద్యార్థులంతా ‘జాయ్స్’గా పిలుచుకుంటారు. దేవీ అహల్య విశ్వవిద్యాలయం, రాణి దుర్గావతి యూనివర్శిటీ పరిధిలోని విద్యార్థి సంఘాల ఎన్నికల్లో మొత్తం 250 పోస్టులకుగాను 162 పోస్టులను జాయ్స్ గెలుచుకుంది. రాష్ట్రంలోని కుక్షీ ప్రాంతానికి చెందిన హీరాలాల్ అలావ, రేవాలో మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి ఈ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఆయన వెంట ప్రస్తుత ఇండోర్ సిటీ జాయ్స్ అధ్యక్షుడు రవిరాజ్ బఘెల్ కలిసి నడిచారు. 2013లో ‘ఫేస్‌బుక్ పంచాయతీ’ పేరిట బర్వాణిలో రెండువేల మంది ప్రజలతో మొదటిసారి సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ‘ఫేస్‌బుక్ మహాపంచాయతీ’ పేరుతో ఇండోర్‌లో భారీ సమావేశాన్ని నిర్వహించగా, రాష్ట్రం నుంచి వేలాది ఆదివాసీలు తరలిరాగా, ఆరు రాష్ట్రాల నుంచి యువజన ఆదివాసీ కార్యకర్తలు తరలి వచ్చారు.
జాయ్స్ ఉద్యమం ఊపందుకుంటుండంతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలోని ఢిల్లీ వైద్య కళాశాలలో క్లినికల్ ఇమ్యూనాలోజీ, రెమటాలోజిలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న హీరాలాల్ అలావ 2017లో వైద్య వృత్తికి గుడ్‌బై చెప్పి సొంతూరుకు వచ్చారు. కొంత మంది తోటి కార్యకర్తలతో కలిసి ప్రతి ఊరుకెళ్లి పంచాయతీలను నిర్వహించడం, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్ కింద ఆదివాసీలకున్న అటవి హక్కులు, పంచాయతీలకున్న హక్కుల గురించి వివరిస్తూ వచ్చారు. ఆదివాసీల వలసలు, స్థ్రానభ్రంశం, పునరావాసం లాంటి అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తొలుత విద్యార్థులకు పరిమితమైన ‘జాయ్స్’ ప్రజల ప్రాతినిధ్యంతో ప్రజా సంఘంగా విస్తరించింది. తొలుత ఈ సంఘంలో భిలాల ఆదివాసీలే ఉండగా, నేడు భిలాలతోపాటు భిల్, భరేలా, పటేలియా ఆదివాసీ జాతులు కూడా వచ్చి చేరాయి. ఆరెస్సెస్ రోజువారి శాఖల నిర్వహణకు చోటు దొరక్కుండా జాయ్స్ చేయగలిగింది. అలీరాజ్‌పూర్, రత్లం, జాభ్వా, ధర్, ఖర్గావ్, బుర్హాన్‌పూర్, ఖండ్వా, దేవాస్, బడ్వానీ జిల్లాల్తో జాయ్స్‌కు ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఈ స్థాయిలో తమ సంఘం జనంలోకి చొచ్చుకు పోవడానికి 90 శాతం ఫేస్‌బుక్ పేజీయే కారణమని రవిరాజ్ బఘెల్ వ్యాఖ్యానించారు.
గత జూలై 29వ తేదీన మాల్వా–నిమర్ ప్రాంతంలో పాలకపక్ష బీజేపీ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’కు పిలుపునిచ్చింది. అందుకు ప్రతిగా అదే రోజున ‘ఆదివాసీ అధికార్ యాత్ర’కు జాయ్స్ పిలుపునిచ్చింది. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాయ్స్ నాయకత్వాన్ని పిలిపించి చర్చలు జరిపారు. మాల్వా–నిమర్ ప్రాంతంలో ఓ వైద్య, ఓ ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆదివాసీల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన సమ్మతించకపోవడంతో బీజేపీతో రాజీ కుదరలేదు. రాష్ట్రంలో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతోని ఎన్నికల పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్ నాయకులు జాయ్స్‌తో సంప్రతింపులకు వచ్చారు. రానున్న ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఆఫర్ తీసుకొచ్చారు.
కనీసం 20 సీట్లు కావాలని కోరుతున్న జాయ్స్ నాయకత్వం హీరాలాల్ అలావ పోటీ చేసేందుకు కుక్షీ అసెంబ్లీ నియోజక వర్గాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ నియోజక వర్గానికి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ విధేయుడు సురేంద్ర సింగ్ బఘెల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లక్ష మందికిపైగా తమ ఆదివాసీ ఓటర్లు, ఐదువేల మంది జాయ్స్ కార్యకర్తలను కలిగిన కుక్షీ నుంచి హీరాలాల్ పోటీ చేయకపోతే తమ ప్రజలు నిరాశకు గురవుతారని జాయ్స్ నాయకత్వం వాదిస్తోంది. గుజరాత్‌లో హార్దిక్ పటేల్, మెవానీ, ఠాకూర్లను సమర్థించిన కాంగ్రెస్ కుక్షీలో హీరాలాల్‌కు మద్దతిస్తే మునిగేదేముంటుందని నాయకత్వం ప్రశ్నిస్తోంది. మధ్యప్రదేశ్‌లో జాభ్వా బహిరంగ సభలో ప్రసంగించేందుకు సోమవారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈ రోజు రాత్రికి జాయ్స్ నాయకత్వం కలుసుకోబోతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment