మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఈసారి కఠిన పరీక్ష ఎదురు కానుంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కమలదళం ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతి రేకతను ఎదుర్కొంటోంది. ఇంతవరకు ఆ పార్టీకి అండగా నిలిచిన గిరిజనులు, అగ్రవర్ణాలు, రైతులు ఈసారి ఎదురుతిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ గెలుపు నల్లేరుమీద నడక కాదని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలు జాతీయ రాజ కీయాలపై గణనీయమైన ప్రభావం చూపను న్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుందా లేక కాంగ్రెస్ పునరుత్తేజితమై అధి కారాన్ని చేపడుతుందా అన్నది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనుబట్టి తేలుతుందని విశ్లేష కులు భావిస్తున్నారు. అయితే అంతర్గత కుమ్ము లాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ... బీజేపీ వ్యతిరేక పవనాలను ఏ మేరకు అనుకూలంగా మార్చుకుంటుందన్నది చూడాల్సి ఉంది.
గత 3 ఎన్నికల్లో కమల దళానిదే పైచేయి..
బీజేపీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విజయం సాధించింది. 2013 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 45% ఓట్లు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లలో బీజేపీకిపడ్డ అత్యధిక శాతం ఓట్లు ఇవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36% ఓట్లు వచ్చాయి. బీజేపీ మొత్తం సీట్లలో 72% సీట్లను గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా తక్కువే (9%) ఉన్నా సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్‌కంటే బీజేపీ బాగా ముందుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకుగాను బీజేపీ 165 స్థానాలు గెలుచుకుంది. వాటిలో 92 నియోజకవర్గాల్లో బీజేపీ 10% కంటే ఎక్కువ ఆధిక్యత సాధించింది. 58 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ కేవలం 17 చోట్ల మాత్రమే 10% కంటే ఎక్కువ ఆధిక్యత నిలుపుకుంది. రాష్ట్రంలో రిజర్వుడు స్థానాల్లోనూ, జనరల్ సీట్లలోనూ బీజేపీ గణనీయమైన ఆధిపత్యం ప్రదర్శించింది.
రిజర్వుడు స్థానాల్లోనూ ముందంజ...
మధ్యప్రదేశ్ జనాభాలో షెడ్యూల్డ్ తెగలు 21% ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 47 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ 47 సీట్లలో 31 చోట్ల గెలిచింది. 80% కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరడానికి సంఘ్ పరివార్ కృషే ప్రధాన కారణమని సామాజిక శాస్త్ర వేత్తలు స్పష్టం చేస్తున్నారు. గిరిజన గూడేల్లో సంఘ్ పరివార్ చేసిన సామాజిక సేవలే దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ విజయానికి బాటలు వేశాయని 2008లో వెలు వడిన ఒక అధ్యయన పత్రంలో రాజకీయ విశ్లేష కులు తారిఖ్ తచిల్, రోనాల్డ్ హెరింగ్‌లు పేర్కొ న్నారు. సంఘ్ పరివార్ కార్యక్రమాల వల్ల బీజేపీ పరపతి పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో హిందుత్వ భావన కూడా పెరిగిందని వారు చెప్పారు.
కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందా...?
ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే వాటిని అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది అనుమానమే. రైతులు, గిరిజనులు, అగ్రవర్ణాల వ్యతిరేకతతోపాటు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే ముఠా కుమ్ములాటలకు పేరొందిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎంతవరకు నెగ్గుకు రాగలదో చెప్పలేం. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి ముఠా తగవులే ప్రధాన కారణమని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌కు చెందిన శ్రేయాస్ సర్దేశి 2014లో నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. కాంగ్రెస్ పార్టీ తనకొచ్చే ఓట్లను సీట్లుగా మార్చుకోగలిగితే రాష్ట్రంలో, దేశంలో కూడా మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని సర్దేశి అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చూపగలిగితే హిందీ రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్టవుతుంది. ఈ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు 2019 ఎన్నికలను ఉత్సాహంతో ఎదుర్కొంటారు. ఇక నాలుగోసారి అధికార పీఠం కోసం చూస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈసారి కూడా నెగ్గితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
రైతుల్లో తీవ్ర అసంతృప్తి...
వ్యవసాయ ప్రధానమైన మధ్యప్రదేశ్‌లో సంప్ర దాయకంగా రైతులు బీజేపీకే మద్దతు పలుకు తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన పరిణామాలు, ప్రభుత్వాల తీరుతో రైతులు బీజేపీపట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం రేపు ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో 10 అతిపేద జిల్లాలతో పోలిస్తే 10 ధనిక జిల్లాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ ధనిక జిల్లాల్లో 50 శాతం ఓట్లు సంపాదించుకుంటే పేద జిల్లాల్లో 39 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రైతుల అసంతృప్తి ఈసారి ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. (ప్రజల ఆస్తులు, సౌకర్యాల తదితర అంశాల ఆధారంగా మింట్స్ డిస్ట్రిక్ట్ వెల్త్ ట్రాకర్ సంస్థ రాష్ట్రంలో పేద, ధనిక జిల్లాలను గుర్తించింది)
మారిన పరిస్థితులు...
ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో ఆ పార్టీ పరపతిని నీరుగారుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణల విషయంలో బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి ఇటు గిరిజనులకు అటు అగ్ర వర్ణాలకు కూడా రుచించలేదు.అలాగే దళితులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో ప్రభుత్వ తీరును గిరిజనులు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టానికి సుప్రీంకోర్టు సూచించిన సవరణలను తిరస్కరించడం ద్వారా కేంద్రం దళితులపట్ల పక్షపాతం చూపుతోందన్న భావన ఉన్నత వర్గాల్లో నెలకొంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే మధ్యప్రదేశ్‌లో కూడా అగ్రవర్ణాల వారు బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment