కెరమెరి(ఆసిఫాబాద్):సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఆషాఢమాసంలో ముందుగా వచ్చే పండుగ అకాడి. నెలవంక కనిపించడంతో అకాడి వేడుకలు ప్రారంభించి వారం రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం పెద్దసాకడ గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో అకాడి పండుగ ప్రారంభించారు. పౌర్ణమి వరకు వేడుకలు నిర్వహించనున్నారు.
వనంలో పూజలు..
అకాడి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దసాకడ గ్రామ పొలిమేరలో ఉన్న బాబ్రిచెట్టు వద్దకు వెళ్లారు. చెట్టుకింద ఉన్న రాజుల్‌పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణరేఖ లాంటి ఒక గీత గీశారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు గీతపై నుంచి అడవిలోకి పరిగెత్తాయి. అడవిలోని చెట్లు, ఆకులకు అకాడిపేన్ పూజ చేశాక ఆ ఆకులను ఇళ్లకు తీసుకెళ్లారు.
కోడితో జాతకం..
ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో భాగంగా గ్రామ పటేల్ ఇంటినుంచి తెచ్చిన కోడిని దేవుడి ముందు ఉంచుతారు. దాని ముందు గింజలు పోసి జాతకం చెప్పించుకుంటారు. అనంతరం ఇంటినుంచి తెచ్చిన కోడిని బలిస్తారు. అక్కడే ఒకచోట వంటలు తయారు చేశారు. అన్నం ముద్దలుగా చేసి ఒక్కొక్కరూ ఒక్కో ముద్ద ఆరగించారు. అనంతరం మేకను బలిచ్చారు.
తుర్ర వాయింపు..
ఈ అకాడి పండుగల్లో మరో కొత్త కోణం ఉంది. అడవిలోకి వెళ్లిన పశువులు ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలని ఆచారం. పశువుల కాపరుల వద్ద ఈ తుర్ర ఉంటుంది. పశువులు ఎక్కడికి వెల్లినా ఈ తుర్ర వాయిస్తే తిరిగి వస్తాయని వారి నమ్మకం. నెల రోజుల పాటు తుర్ర వాయిస్తూనే ఉంటారని పలువురు కటోడాలు చెబుతున్నారు.
ఏత్మాసార్ పేన్‌కు పూజలు!
అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్‌కు పూజలు చేశారు. నాలుగు మాసాలపాటు ఈ పూజలు కొనసాగనున్నాయి. గ్రామంలో ఉన్న ప్రజలతో పాటు పశువులు క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అకాడి అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివబోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, దీపావళి పండుగలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment