సాక్షి, భూపాలపల్లి : ఆదివాసీ- లంబాడీల వివాదం హింసాత్మకంగా మారింది. మేడారం జాతర ట్రస్టు బోర్డులో ఉన్న ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని గత కొద్ది రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాతర కోసం తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వెళుతుండగా ఆదివాసీలు వారిని అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కొంతమంది ఆందోంళనకారులు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment