
సాయుధ వసంతగీతం
ఉద్యమ నవల: 1980 దశకం మధ్యలో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో, అడవంచు పల్లెల్లో ప్రజల కోసం, ముఖ్యంగా ఆదివాసీలకు భూమి, భుక్తి, విముక్తి కోసం ఒక దళం సాగించిన పోరాటాన్ని, దాన్ని అణచడానికి ప్రభుత్వం అమలు చేసిన హింసా విధానాలను రాజయ్య తన రాజకీయ విశ్వాస కోణంలో సాహిత్య, కళాసౌందర్య విలువలను బలిపెట్టకుండా పరిచయం చేశాడు.
జీవితం నిత్యబాధల రంపపు కోతలా మారిన వర్తమానంలో సాయుధ విప్లవం, గెరిల్లా పోరాటం, కాల్పులు, మందుపాతర్లు, కూంబింగ్‌లు, ఎన్‌కౌంటర్లు, దళాలు, ఇన్‌ఫార్మర్లు వంటి మాటలు మరింత భయంగొల్పుతాయి. అడవి అందాలను కవితల్లో, చిత్రాల్లో అనుభవించి, పలవరించే సామాన్యులకు అడవి కడుపులో చెలరేగుతున్న బడబానలం, పారుతున్న నెత్తుటి కాల్వలు, పురుడు పోసుకుంటున్న కొత్త ప్రపంచాల గురించి అంతగా తెలియకపోవచ్చు. తెలుసుకొని కలవరపడ్డమెందుకు, అరణ్య మధురస్వప్నాలను ఆవిరి చేసుకోవడమెందుకు అనుకునేవాళ్లు అల్లం రాజయ్య వీరగాథలా ఆలపించిన ‘వసంత గీతాన్ని’ అస్సలు వినకూడదు. పొరపాటున విన్నా చప్పున మరచిపోవాలి. లేకపోతే అది మన బుద్ధికి వేల పదునైన కొడవళ్లను వేలాడగట్టి ఎటూ కదలనివ్వదు. కదిలేందుకు ప్రయత్నించామా రక్తపాతమే.
అడవి మల్లెల చల్లని తెలుపును, మోదుగపూల వెచ్చని ఎరుపును శ్రుతిలయలుగా మార్చుకొని, తుపాకీ మోతల షడ్జమ స్వరంతో, థింసా నాట్యపు ఊపులా సాగే ఆ పాట అంత ప్రమాదకరమైనది మరి. నాలుగున్నర దశాబ్దాల కిందట నక్సల్బరిలో గర్జించి, దేశమంతా అల్లుకుపోయిన వసంత మేఘాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన ఈ నవల తెలుగు విప్లవ సాహిత్యంలో ఒక మైలురాయి. ఉద్యమ ఆహ్వానం. నేలకొరిగిన ఉద్యమకారుల స్మరణకు పరిమితమైన సహజావేశ కవిత్వంలో చెప్పలేని, కథలకు పూర్తిగా అందని ఉద్యమ జీవితాన్ని దాని సమస్త కోణాల్లో ఇది అద్భుతంగా చిత్రించింది. ఉద్యమంలో ఉండే కష్టనష్టాలు, ఉద్వేగ, ఉత్కంఠభరిత యుద్ధాన్ని నగ్నంగా కళ్లకు కట్టింది. చైనా విప్లవాన్ని కవాతు పాటల్లా చిత్రించిన ‘ఉదయ గీతిక’, ‘ఎర్ర మందారాలు’ కోవలోని సాయుధ సైనిక నవల ఇది. 1990లో ‘గోదావరి ప్రచురణలు’ తొలిసారి ముద్రించిన ఈ నవలను ఇటీవల వరవరరావు ముందుమాటతో పర్‌స్పెక్టివ్స్ పునర్ముద్రించింది.
1980 దశకం మధ్యలో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో, అడవంచు పల్లెల్లో ప్రజల కోసం, ముఖ్యంగా ఆదివాసీలకు భూమి, భుక్తి, విముక్తి కోసం ఒక దళం సాగించిన పోరాటాన్ని, దాన్ని అణచడానికి ప్రభుత్వం అమలు చేసిన హింసా విధానాలను రాజయ్య తన రాజకీయ విశ్వాస కోణంలో సాహిత్య, కళాసౌందర్య విలువలను బలిపెట్టకుండా పరిచయం చేశాడు. పరిస్థితుల ప్రభావంతో నక్సల్‌గా మారిన లింగయ్య అలియాస్ గట్టయ్య కుటుంబతీపితో దళాన్ని వదలడం, తన కుటుంబ ఈతిబాధలు ఉద్యమంతో తప్ప పరిష్కారం కావని తెలుసుకుని మళ్లీ దళంలో చేరడం ప్రధాన ఇతివృత్తం. దళంలోని గిరిజన రాధక్కకు శత్రువు పైనే కాకుండా పరుషాధిపత్యం పైనా పోరాడడం అదనపు బాధ్యత. యుద్ధంలో ఉండే హింస, ఎత్తుగడలు, అచంచల విశ్వాసం, ద్రోహం, గెలుపోటములు నవల సాంతం యాంత్రికంగా కాకుండా రక్తమాంసాల మనుషుల చర్యల్లా సహజంగా, నాటకీయంగా సాగుతాయి. వస్తువు తీవ్రమైంది కాబట్టి శిల్పం కూడా తీర్చిదిద్దినట్టు కాకుండా వస్తువు గమనానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది.
కొన్ని చోట్ల అఫెన్స్, రిట్రీట్, గెరిల్లా జోన్, బేస్ యూనిట్ వంటి దళం పరిభాష, రాజకీయాల విశ్లేషణలు శ్రుతి మించినట్లు అనిపించినా కథాగమనానికి ఆటంకం కలగనివ్వవు. అడవి, పల్లె సమయాల వర్ణనలు శివసాగర్ రొమాంటిక్ విప్లవ కవితల్లా ఉంటాయి. చెవులకు పండగ చేసే ఆదిలాబాద్ యాస, తునికాకు పరిమళం,గోడు దాదల ఆత్మీయ ‘రాం రాం’ పలకరింపులు, కామ్రేడ్ల లాల్‌సలామ్‌ల నడుమ గగుర్పొడిచే ఎన్‌కౌంటర్లు సాగిపోతూ ఉంటాయి. వరవరరావు మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పటి వరకు వచ్చిన రాజకీయార్థిక చారిత్రక నవలలకు వసంతగీతం ఒక సైనిక కోణాన్ని జోడించింది’.
‘వసంతగీతం’ ఊరిలోనే కాదు అడవిలోనూ అరుదుగా కనిపించే పేరు తెలియని రంగురంగుల పక్షి. చూడనివాళ్లు దురదృష్టవంతులు.
- పి. మోహన్
వసంతగీతం - అల్లం రాజయ్య, పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ,
వెల: రూ.250; ప్రతులకు- విశాలాంధ్ర (040-24224458)