'ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకూ ఆందోళన'
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల స్పష్టం చేశారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నివాసంలో వారు సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తరువాత ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రేపు కూడా పార్లమెంట్‌లో తమ నిరసన కొనసాగిస్తామని చెప్పారు. జేపీసీనా, ఆల్‌పార్టీ కమిటీనా అనేది తమకు తెలియదన్నారు.
తెలంగాణపై స్పీకర్ ఫార్మట్‌లోనే తాము రాజీనామాలు ఇచ్చినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అన్ని పార్టీలు సస్పెన్షన్‌ను వ్యతిరేకించాయన్నారు. మెజార్టీ పార్టీలు తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు దీనికి అర్థం అన్నారు.
ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. జేపీసీ లేక అఖిలపక్షం లేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తే అంగీకరిస్తామని చెప్పారు. విభజన ప్రస్తావన లేకుండా కమిటీ ఏర్పాటు చేస్తే ఒప్పుకుంటామన్నారు. విభజన అనే మాట ఉంచితే ఏ కమిటీలైనా ఒప్పుకోం అని చెప్పారు. అన్ని అంశాలపై పరిష్కారాలు చూపిన తర్వాతే విభజన అంశాన్ని లేవనెత్తాలని వెంకట్రామిరెడ్డి అన్నారు.