ఇకపై మరింత దూకుడుగా!  | BJP Speed Up On TRS For Assembly elections Telangana | Sakshi
Sakshi News home page

ఇకపై మరింత దూకుడుగా! 

Published Thu, Nov 24 2022 5:26 AM | Last Updated on Thu, Nov 24 2022 1:04 PM

BJP Speed Up On TRS For Assembly elections Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌పై మరింత దూకుడుగా ముందుకెళ్లాలని రాష్ట్ర బీజేపీకి దిశానిర్దేశం చేస్తూ ప్రశిక్షణ్‌ శిబిరం, కార్యవర్గ భేటీ ముగిశాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశాల్లో చర్చించారు. రాష్ట్రంలోని అనేక సమస్యలు, అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని నిలదీయాలని.. వైఫల్యాలను ఎండగట్టి పోరాటానికి ప్రజా మద్దతును కూడగట్టాలని తీర్మానించింది.

రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలపై ప్రజల పక్షాన నిలిచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. 8 ఏళ్లలో ముఖ్యంగా రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని తీర్మానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కోసం కృషి చేయాలని ప్రశిక్షణ్‌ శిబిరంలో దిశానిర్దేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. 

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కుట్రకోణంపై.... 
కేంద్రం, ప్రధాని మోదీ, బీజేపీ నేతల పట్ల టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు.. ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణలు, అందులోని కుట్రకోణం.. ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌పై కక్షగట్టి సిట్‌ ద్వారా నోటీసులివ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరును ఎండగట్టేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై సమాలోచనలు సాగించినట్లు తెలుస్తోంది.

శామీర్‌పేటలోని ఒక రిసార్ట్స్‌లో నిర్వహించిన మూడు రోజుల ప్రశిక్షణ్‌ శిబిరంలో బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో, పరివార్‌ సంఘాలతో సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పురోగతి, బీసీ తదితర వర్గాల సంక్షేమం, వ్యవసాయ రంగాల్లో మార్పులు, విదేశీ విధానంపై దేశానికి కలిగిన ప్రయోజనాలు.. తదితరాలపై అవగాహన కల్పించారు.

సైద్ధాంతిక అంశాల్లో భాగంగా ఏకాత్మత మానవతావాదం, సాంస్కృతిక జాతీయవాదం, మరో రెండు అంశాలు, మోదీ సర్కార్‌ ఆర్థిక, సంక్షేమ, వ్యవసాయ, విదేశాంగ విధానాల్లో సాధించిన విజయాలకు, పార్టీ ఎగ్జిక్యూటివ్‌ ప్రక్రియలో భాగంగా పై నుంచి కింద వరకు పనివిధానం, నాయకులకు బాధ్యతలు వంటి వాటిని వివరించారు. 

ఎన్నికల సన్నాహకంగా... 
రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల సన్నాహకంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు పార్టీవర్గాల సమాచారం. వచ్చే ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తీరు, ఏడాది వరకు చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై పార్టీ నాయకత్వం దశాదిశా నిర్ధేశించింది. పూర్తిగా జాతీయ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా కసరత్తును రాష్ట్ర పార్టీ నిర్వహించింది.

ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాబోయే ఎన్నికలకు పార్టీకి దిశానిర్దేశం చేసిన విషయం విదితమే. ఈ శిబిరంలో దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపునిచ్చారు. ప్రధానంగా పార్టీ నిర్మాణం, సంస్థాగత పటిష్టత, నేతల మధ్య సమన్వయం, సమష్టిగా పనిచేయడంపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పోలింగ్‌బూత్‌ల స్థాయిలో మరింత మెరుగైన సమన్వయం సాధనకు ఇది దోహద పడుతుందని భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement