కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబరులో మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకుంది. ఇవి వ్యవసాయ సంస్కరణలను ఆటో పైలట్ మోడ్‌లో ఉంచాయి. 1991లో సరళీకరణ కూడా ఇలాంటి ప్రభావాన్నే తీసుకొచ్చింది. ఆరోజు కూడా ప్రతిపక్షాలు సరళీకరణను ఇలాగే అడ్డుకున్నాయి కానీ కాలం గడిచే కొద్దీ వారి అభిప్రాయం తప్పని రుజువైంది. వ్యవసాయ రంగంలో తలుపులు తెరవడం పట్ల రైతులు సానుకూల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు కలిసి 1991లో సంస్కరణలు ప్రారంభించిన ఆ పరమాద్భుత క్షణాల్లోకి వెళ్లకుండా భారతీయ వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నాయి. ఇన్నేళ్ల తర్వాత వ్యవసాయ బిల్లులు ఆనాటి సరళీకరణను తలపిస్తూ దేశ వ్యవసాయ సంస్కరణలను ఆటో–పైలట్ మోడ్‌లో ఉంచాయి. ఇప్పటిలాగే ఆనాడు కూడా పెడబొబ్బలు పెట్టే ప్రతిపక్షం ఉండేది. కానీ వారి అరుపులన్నీ కాలం గడిచే కొద్దీ తప్పు అని రుజువయ్యాయి. ప్రజాస్వామ్యానికి అధికార వాణిగా పేరొం దిన థామస్ జెఫర్సన్ చెప్పారు.. ‘‘వ్యవసాయం అనేది అత్యంత తెలివైన అన్వేషణ. ఎందుకంటే అంతిమంగా అది దేశ నిజమైన సంపదకు, మంచి నైతిక విలువలకు, సంతోషానికి తోడ్పడుతుంది’’. భారతీయ వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన మాటలు చక్కగా వర్ణిస్తాయి. 73 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత, శతాబ్దాల వ్యవసాయ అనుభవం తర్వాత కూడా మనం ఆయన ప్రకటన సారాంశాన్ని అర్థం చేసుకోవడం లేదు.
సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా వ్యవసాయం ఒక ప్రత్యేక రంగంగా విడిగా నడుస్తోంది కానీ జాతీయ ఆర్థిక వ్యవస్థతో అది మిళితం కావడం లేదు. దేశంలో 70 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నాయి. దేశ స్థూలదేశీయోత్పత్తిలో 17 శాతాన్ని మాత్రమే అందిస్తున్న వ్యవసాయ రంగం మొత్తం జనాభాలో 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిస్థితి ఏకకాలంలో ఉపాధి లేమిని, అరకొర ఉపాధిని ప్రతిబింబిస్తోంది. అయినప్పటికీ వ్యవసాయ రంగ శక్తిసామర్థ్యాలు అపారమైనవి. కోవిడ్–19 మహమ్మారి కాలంలో వేగంగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులవైపు దిశను మార్చుకున్న వ్యవసాయ విధానాలు మరింతగా విస్తరించాయి.అదేసమయంలో సవాళ్లు కూడా తక్కువగా లేవు. ప్రకృతిలో అనూహ్య మార్పులు చాలా తరచుగా సంభవిస్తున్నాయి. దీంతో అకాల వర్షాలు, కరువులు పదే పదే వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక రాజకీయ జోక్యం అనే మరో సవాలు సంస్కరణల పురోగతిని గణనీయంగా అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో పంజాబ్ తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన తాజా వ్యవసాయ చట్టాలు కనీస మద్దతు ధరను ఎత్తివేయడానికి దారి తీస్తాయని, బడా కార్పొరేట్ వర్గాల దయాదాక్షిణ్యాలకు తమను బలిచేస్తారని భావిస్తుండటంతో రైతులు తమ నిరసనలపట్ల ఎలాంటి బాధను, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడం లేదు.
చిట్టచివరి వారికి కూడా చేరేలా (ఎల్‌ఎమ్‌సి) పథకాల ఏర్పాట్లు ఉంటేనే భారతీయ అమలు వ్యవస్థ విజయవంతం అవుతుంది.. గ్రామీణ భారతానికి ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. కోవిడ్ మహమ్మారి ఈ ఎల్‌ఎమ్‌సి ప్రాధాన్యతను ఒక్కసారిగా వేగవంతం చేసింది. అందుకే ఆత్మనిర్భర ఉద్యమంలో భాగంగా వివిధ ప్రకటనలను కేంద్రం జారీ చేసింది. సమీకృత ఆర్థిక వృద్ధిని సాధించడానికి ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్తు, నీటి సరఫరా అనేవి ప్రాణాధారమైనవి. కోవిడ్ కాలంలో వ్యవసాయ రంగం మాత్రమే గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కరోనా కాలం లోనే వరి ఎగుమతులు బాగా పెరి గాయి. నెస్టిల్, డాబర్, బ్రిటానియా వంటి కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు శరవేకంగా తమ నెట్‌వర్క్‌లను విస్తరించాయి. అనుకూలమైన రుతువులు, కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర గరిష్టంగా ఉండటం, వలసబాట పట్టిన వారు తిరిగి తమ ఊళ్లకు చేరుకోవడం, ప్రభుత్వ సంక్షేమ చర్యలు పుంజుకోవడం వంటివి దీనికి మరింతగా దోహదం చేశాయి.
అదే సమయంలో సరళీకరణ ప్రారంభ దిశలో అంటే 1991లో వ్యవసాయదారులు అద్భుత క్షణాలను ఆస్వాదించారు. చాలా కాలం తర్వాత 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను చట్టరూపంలోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు స్తబ్దంగా ఉండిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజం చెందించే లక్ష్యంతో వరుస సంస్కరణలకు తాజా వ్యవసాయ చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే వీటి ద్వారా ప్రయోజనాలు పొందే అన్ని వర్గాలు దాపరికం లేని మనస్తత్వంతో వ్యవహరించాలి. అయితే ప్రస్తుతం ఇది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్లాలు కేంద్ర బిల్లులను రాజకీయంగా వ్యతిరేకించడం ప్రారంభించాయి. మరోవైపున ఈ సంస్కరణలు చిన్న, సన్నకారు రైతులను భయాందోళనల్లో ముంచెత్తుతున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి భారతీయ వ్యవసాయ రంగం మార్కెట్ ఆధారిత రంగంలోకి ప్రవేశించే క్రమంలో ఉంది. వ్యవసాయ విలువ ఆధారిత సరఫరా చెయిన్‌ను వేగవంతం చేయడానికి, మధ్యదళారుల నుంచి చిన్న, సన్నకారు రైతులను విముక్తి చేయడానికి, విత్తులు నాటిన సమయం నుంచే ముందే నిర్దేశించిన మార్కెట్ ధరతో రైతులు ప్రయోజనం పొందడం కోసం ఒక సమగ్రమైన, నిలకడైన చట్రాన్నితీసుకురావడానికి రైతులు వ్యవసాయంలో తలుపులు తెరవడం పట్ల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎట్టకేలకు వ్యవసాయం ఒక పరిణిత రంగంగా మార్పు చెందుతోంది. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఉల్లిపాయలు, యాపిల్స్ వంటి ఉత్పత్తులను దీర్ఘకాలం పాటు శీతలీకరించేందుకు గానూ పది వేల టన్నుల సామర్థ్యంతో కూడిన ఉష్ణోగ్రతల నియంత్రిత గిడ్డంగులను ఏర్పరుస్తోంది. ఇది రైతులకు మేలు చేయడమే కాకుండా ధరల స్థిరీకరణకు కూడా తోడ్బడుతుంది. వ్యవసాయ అభివృద్ధిలో టెక్నాలజీని వర్తింపజేయడం వేగం పుంజుకుంది. కొన్ని టెక్నాలజీ సంస్థలు డేటా ఆధారిత వ్యవసాయాన్ని స్పెషలైజ్ చేస్తున్నాయి. వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయంపై దృష్టి తప్పనిసరి అవుతోంది.
వ్యవసాయరంగ దుస్థితి దాని కారణంగా ఏర్పడుతున్న నిరుద్యోగిత అనే అతిపెద్ద కొరతను తీర్చడానికి కార్యాచరణ పథకం అవసరం అవుతుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న పంజాబ్‌ని వ్యవసాయ సంస్కరణలలో బీహార్ మార్గంలో వెళ్లడానికి అనుమతించకూడదు. వ్యవసాయ సంస్కరణలు రాజకీయ సులోచానాల నుంచి చూడకూడదు. పంజాబ్ రాష్టం తన సొంత వ్యవసాయ బిల్లులను ఆమోదించిన తరుణంగా పంజాబ్ రైతులు ఢిల్లీకి ఎందుకు దండు కట్టారన్నదే సమస్య. పంజాబ్ రాష్ట్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులు ఉత్తమంగా ఉన్నాయని భావిస్తున్న ఆ రాష్ట్ర రైతులు కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను మాత్రం వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రకటనలను తలపించే మాటలు మాట్లాడుతూ న్యాయ పోరాటానికి కూడా దిగుతున్నారు. అయితే ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతుల విషయంలో చేసినట్లు తాత్కాలిక ప్రయోజనాలతో కూడిన రాజకీయాలను అందరూ నిలిపివేయాలి.
వాస్తవానికి పురోగామి స్వభావం కలిగిన వ్యవసాయ సంస్కరణలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాల మధ్య పోటీ తత్వం ఉండాలి. అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనూ వ్యవసాయ ప్రయోజానాలను ప్రోత్సహించేలా కుదుర్చుకోవాలి. ప్రకృతి సహజమైన, సాస్కృతిక పరమైన వనరులు సమృద్ధిగా ఉన్న భారత్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ–పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. వ్యవసాయ సంస్కరణలు అమలు కావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వ్యవసాయ బిల్లులు ఆహార భద్రతకు హామీ ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల మనోభావాలపై ప్రభావం చూపేలా దాన్ని అనుమతించకూడదు.
కిరణ్ నందా, కార్పొరేట్ ఆర్థికవేత్త
Comments
Please login to add a commentAdd a comment