కృష్ణలంక (విజయవాడ తూర్పు) : కోట్లాది మంది రైతుల పక్షాన ప్రధాని మోదీకి శిరస్సు వంచి నమస్కారం చేస్తా, దయచేసి రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయండని ప్రముఖ సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వేడుకున్నారు. గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన బుధవారం వ్యవసాయ సంక్షోభం–పరిష్కారం అనే అంశంపై రైతు సంఘీభావ సభ నిర్వహించారు. నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులతో సహా అన్ని రంగాల ప్రజల మద్దతును కూడగట్టి విజయాలను సాధించగలగడమే స్వర్గీయ చరణ్‌సింగ్‌కు ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆలిండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతులను, కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడారు. అనంతరం రైతాంగ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యాచరణ ప్రకటించారు.
ఈ నెల 24న మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, 27, 28 తేదీలలో మాకీబాత్ కార్యక్రమానికి నిరసనగా డప్పులు, పళ్లేలు మోగించి నిరసన తెలపాలని, ఆదాని, అంబానీ వస్తువులను బహిష్కరించాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వి.శ్రీనివాసరావు రాసిన వ్యవసాయ చట్టాలతో రైతుకు మరణ శాసనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, వివిధ రైతు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment