రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా! | Farm Bills to be Tabled in Rajya Sabha on Sunday | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా రాజ్యసభ.. బిల్లు గట్టెక్కేదెలా!

Published Sat, Sep 19 2020 1:13 PM | Last Updated on Sat, Sep 19 2020 6:45 PM

Farm Bills to be Tabled in Rajya Sabha on Sunday - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రేపు (ఆదివారం) రాజ్యసభ ముందుకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు ఎలాంటి అవాంతరాలు లేకుండా లోక్‌సభలో ఆమోదం పొందగా మూడు బిల్లులపై ఆదివారం రాజ్యసభలో ఓటింగ్‌ ప్రక్రియ జరుగనుంది. అయితే రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం అధికార పార్టీకి అంత సులవైన అంశంలా లేదు. గత మిత్రపక్షం శివసేనాతో పాటు.. తాజాగా శిరోమణీ అకాలీదళ్‌ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లును రాజ్యసభలో  గట్టేక్కిచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. (అన్నదాతల ఆందోళన)

మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులు ఉండగా.. మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యులు మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అకలీదళ్‌ (3) వ్యతిరేకంగా ఓటు వేసినా.. మిగతా పార్టీల మద్దతును కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. బీజేపీ భావిస్తున్నట్లు జేడీయూతో పాటు అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోనే బీజూ జనతాదళ్‌ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఎస్పీతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటింగ్‌పై స్పష్టత లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌ బిల్లులకు అనుకూలంగా ఓటు వేసినా.. ఆప్‌, బీఎస్పీ, ఎస్పీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుపై బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది. (భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!)

మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్ష కాంగ్రెస్‌ పార్టీల మద్దతును కూడగడుతోంది. రాజ్యసభలో బిల్లులను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్‌ గాంధీ.. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఇక బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి రాజ్యసభ సమావేశాలు రసవత్తరంగా జరుగనున్నాయి. (బీజేపీ షాక్‌: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement