సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో ఈ వానాకాలం మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని సీఎం తెలిపారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. (ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్‌దే: షెకావత్)
తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని సీఎం రైతులను కోరారు. వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment