బీజేపీ షాక్‌: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం! | Dushyant Chautala may Quit NDA In Haryana | Sakshi
Sakshi News home page

కుప్పకూలనున్న బీజేపీ సర్కార్‌..!

Published Fri, Sep 18 2020 11:24 AM | Last Updated on Fri, Sep 18 2020 1:57 PM

Dushyant Chautala may Quit NDA In Haryana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్‌ దుశ్యంత్‌ సింగ్‌ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమంటూ అకాలీదళ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. చౌతాలా మీదకూడా ఒత్తిడి పెరుగుతోంది. (కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా)

కేంద్ర ప్రతిపాదిత బిల్లుపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్లు సైతం అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ సీరియర్లు, ఎమ్మెల్యేలతో చౌతౌలా సమావేశం కానున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేజేపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాల కోరారు. రైతుల పక్షపాతిగా చరిత్ర కలిగిన చౌతౌలా కుటుంబం క్లిష్ల సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. మాజీ ఉప ప్రధాని, దేవీలాల్‌కు రైతు బాంధవుడిగా మంచి గుర్తింపు ఉందని, దుశ్యంత్‌ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ట్విటర్‌ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్‌ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌(ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌)’ బిల్లును, ‘ద ఫార్మర్స్‌(ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం)

ఇదిలావుండగా.. 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్‌ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్‌ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జేజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఖట్టర్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement