తాత్కాలికమే కానీ.. వరాల జల్లే! | NDA Government Plans To Intelligence Budget | Sakshi
Sakshi News home page

తాత్కాలికమే కానీ.. వరాల జల్లే!

Published Thu, Jan 31 2019 1:25 AM | Last Updated on Thu, Jan 31 2019 1:25 AM

NDA Government Plans To Intelligence Budget - Sakshi

తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలన్న సంప్రదాయాన్ని పాటిస్తూనే.. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలను వెలువరించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక బడ్జెట్‌కు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి తారీఖున బడ్జెట్‌ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని గతేడాది నుంచి ప్రారంభించిన మోదీ సర్కారు.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తాత్కాలిక బడ్జెట్‌ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుందన్న వార్తలు వెలువడ్డాయి. దీనికితోడు బుధవారం ఉదయం ఆర్థిక శాఖ ఒక వాట్సాప్‌ సందేశంలో.. 2019–20 బడ్జెట్‌ను తాత్కాలిక బడ్జెట్‌గా పేర్కొనవద్దని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్‌ సహా విపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో వెనక్కు తగ్గిన ఆర్థిక శాఖ.. తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నట్లు బుధవారం సాయంత్రం స్పష్టం చేసింది. తాత్కాలిక బడ్జెట్‌ కారణంగా ఈసారి ఎకనమిక్‌ సర్వే ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్‌ సమయంలో మాత్రమే ఎకనమిక్‌ సర్వే ఉంటుంది.  – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

 రైతులపై వరాల జల్లు!  తాత్కాలికమైతేనేం.. 
బడ్జెట్‌ తాత్కాలికమా? పూర్తిస్థాయిలోనా అన్న సంగతి పక్కన పెడితే.. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు ఈ ఐదేళ్ల పదవీకాలంలో ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే. ఇప్పటిదాకా ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ అనారోగ్య కారణంగా.. ఆ బాధ్యతల్ని స్వీకరించిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావటంతో దీనిపై సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు ఎన్నో వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. రైతులకు ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ, వేతన జీవులకు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలతోపాటు అత్యధిక సంఖ్యలో ఉన్న చిరువ్యాపారులకు రుణాల పరంగా వెసులుబాటు కల్పించొచ్చని భావిస్తున్నారు. 

మొదటి బడ్జెటే తాత్కాలికం! 
భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన మొదటిదే తాత్కాలిక బడ్జెట్‌. దీన్ని 1947 నవంబర్‌ 26న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఐదు బడ్జెట్‌లను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల ఆర్థికమంత్రులు ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో విధాన నిర్ణయాలు ప్రకటించకూడదు. అయితే, 1947 నవంబర్‌ 26న ప్రవేశపెట్టిన తొలి తాత్కాలిక బడ్జెట్‌ అని ఆ సమయంలో.. నాటి ఆర్థిక మంత్రి చెట్టి పేర్కొనలేదు. కానీ, 1948 ఫిబ్రవరి 28న రెండో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ, మొదటిది తాత్కాలిక బడ్జెట్‌ అని చెప్పారు. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు (జనతాపార్టీ) ఆర్థిక మంత్రిగా హెచ్‌ఎం పటేల్‌ 1977లో ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించారు. 1991లో చంద్రశేఖర్‌ కేబినెట్‌లోని ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మన్మోహన్‌సింగ్‌.. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు తొలిసారి తాత్కాలిక బడ్జెట్‌ సమర్పించారు. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు జనవరిలో ప్రణబ్‌ ముఖర్జీ మొదటిసారి తాత్కాలిక బడ్జెట్‌ సమర్పించారు. 2014 ఫిబ్రవరి 17న పి.చిదంబరం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు జైట్లీకి అనారోగ్యం కారణంగా  పీయూష్‌ గోయల్‌కు ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది.
 
ఆదాయపు పన్ను పరిమితి పెంపు! 
ఇక మధ్యతరగతి వర్గాలు ఆదాయపన్ను పరంగా మినహాయింపులు ఈ బడ్జెట్‌లో ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయపన్ను ప్రామాణిక మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. సెక్షన్‌ 80–సీ కింద వివిధ మార్గాల్లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఆదాయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో దీన్ని రూ.2–2.5 లక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని బ్యాంక్‌ బజార్‌ సీఈవో అదిల్‌శెట్టి అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో ఇళ్ల కొనుగోలుదారులకు ఆదాయపన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు చేయాలన్న డిమాండ్‌ కూడా ఉంది. ఇతర డిమాండ్లలో.. కేవలం ఈక్విటీ ఫండ్స్‌కే కాకుండా, డెట్, హైబ్రిడ్‌ ఫండ్స్‌ కూడా సెక్షన్‌ 80–సీ కింద మినహాయింపు కల్పించడం.. దీర్ఘకాలిక మూలధన లాభం రూ.లక్ష దాటితే పన్ను పరిమితిని పెంచడం వంటివి కూడా ఉన్నాయి. 

 వాస్తవ పరిస్థితులివీ! 
జీడీపీలో ద్రవ్యలోటును 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3%కు కట్టడి చేయాలన్నది కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ ఈ లక్ష్యం డిసెంబర్‌ నాటికే దాటిపోయింది. దీంతో మిగిలి ఉన్న కాలానికి వ్యయాల పరంగా పరిమితులున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపులు, ఇతర ప్రోత్సాహకాలకు తాత్కాలిక బడ్జెట్‌లో చోటు కల్పిస్తే.. అవి 2019–20 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలపై భారం చూపిస్తాయి. 2014లో ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు స్వీకరించే నాటికి ద్రవ్యలోటు 5% ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత.. నాటి యూపీఏ సర్కారు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. కానీ, వీటిని సకాలంలో ఉపసంహరించుకోలేదు. దీని వల్ల 2009–10 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 6.5%కు పెరిగిపోయింది. దీన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు గట్టి ప్రయత్నాలనే చేసింది.

చమురు ధరలు కనిష్ట స్థాయిలకు చేరడం ఇందుకు సాయపడింది. అయితే, జీఎస్టీని అమల్లోకి తేవడం, బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్‌ సాయం అంచనాలను మించడంతో ద్రవ్యలోటు ప్రణాళికలపై ఒత్తిడికి దారితీశాయి. దీంతో 2017–18లో 3.2% లక్ష్యాన్ని చేరడంలో వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5% వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018–19లో ద్రవ్యలోటు 3.3% లక్ష్యం కాగా, డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలల కాలానికే ఈ లక్ష్యానికి 115 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3% లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement