జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సం పన్న మిత్రుల కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. వారి కోసం రాచబాటలు పరుస్తున్నారని దుయ్యబట్టా రు. రైతులను బెదిరిస్తున్న మోదీ చైనాను మాత్రం ఎదిరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజస్తాన్ రాష్ట్రం హనుమాన్‌గఢ్ జిల్లాలోని పిలీబంగా పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల తొలి మహాపంచాయత్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు దేశంలో 40 శాతం జనాభాను ప్రభావితం చేస్తాయన్నారు. కేవలం రైతులే కాకుండా వ్యాపారులు, కార్మికులు కూడా నష్టపోతారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తర్వాత కొత్త వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు మరో పెద్ద దెబ్బేనని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే..
కార్పొరేట్ వ్యాపారుల గుత్తాధిపత్యమే
‘‘తూర్పు లద్దాఖ్‌లో సైనిక బలగాల ఉపసంహరణపై చైనాతో కుదిరిన ఒప్పందం సరైంది కాదు. పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్ 3, 4 మధ్యనున్న ప్రాంతాన్ని మోదీ ప్రభుత్వం చైనాకు ధారాదత్తం చేసింది. చైనా ముందు నిలబడలేని నరేంద్ర మోదీ మన రైతులను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే ఆయన అసలు రంగు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు అది నల్లధనంపై పోరాటం కాదని చెప్పా. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేనని వివరించా. అయినా అప్పట్లో ప్రజలు అర్థం చేసుకోలేదు. తర్వాత ప్రజల డబ్బు బ్యాంకులకు చేరడం, ముగ్గురు నలుగురు బడా బాబుల రుణాలు మాఫీ కావడంతో అసలు విషయం బయటపడింది. నోట్ల రద్దు తర్వాత జీఎస్టీతో మోదీ ప్రభుత్వం ప్రజల వెన్ను విరిచింది. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు మూతపడడం ఖాయం. రైతుల నుంచి పంటల కొనుగోళ్లను ఇకపై కార్పొరేట్ వ్యాపారులే శాసిస్తారు. వారి గుత్తాధిపత్యమే కొనసాగుతుంది. దేశంలోని మొత్తం పంటలను ఒకే వ్యక్తి కొనుగోలు చేసి, దాచిపెట్టే పరిస్థితి కూడా వస్తుంది.
చిరు వ్యాపారుల పరిస్థితేంటి?
దేశంలో 40 శాతం జనాభా చేసుకుంటున్న వ్యాపారాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు కట్టబెట్టడమే కొత్త సాగు చట్టాల పరమార్థం. దేశమంతటా ఒకే కంపెనీ పండ్లు, కూరగాయలు, సరుకులు అమ్మితే రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు, సరుకులు అమ్ముకొని, పొట్టపోసుకునే చిరు వ్యాపారుల పరిస్థితి ఏమిటి? కొత్త చట్టాలతో దేశంలో 40 శాతం మంది ఉపాధి కోల్పోతారు. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే రైతులు పోరుబాట పట్టారు. రైతన్నల సంక్షేమం కోసమే కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని చెబుతున్నారు. అదే నిజమైతే రైతులు ఎందుకు ఆందోళన సాగిస్తున్నారు? ఈ పోరాటంలో 200 మంది ఎందుకు చనిపోయారు?’’ అని రాహుల్ గాంధీ నిలదీశారు.
ప్రధానిమోదీకి, బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై నమ్మకం లేదని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని తప్పుపట్టారు.
ఏడు రైతు మహాసభల్లో పాల్గొననున్న తికాయత్
ఘజియాబాద్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ సోమవారం నుంచి హరి యాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల్లో వరుస గా జరుగుతున్న ఏడు రైతు మహాసభలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 23తో ఇవి ముగుస్తాయని బీకేయూ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ తెలిపారు.
చైనాకు అప్పగించారు
భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. చైనా ఆగడాలకు ఎదురు తిరగలేని పిరికిపంద నరేంద్ర మోదీ, మన సైనికుల త్యాగాలను ఆయన అవమానిస్తున్నారు అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మన భూమిని పరాయి దేశానికి అప్పగించడాన్ని దేశంలో ఎవరూ అంగీకరించరని చెప్పారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద తాజా పరిస్థితిపై పార్లమెంట్‌లో ప్రధాని ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిస్తున్నారని తప్పుపట్టారు.
‘‘భారతదేశ భూభాగాన్ని చైనాకు అప్పగించానని మోదీ చెప్పాలి, ఇదే నిజం’’ అని పేర్కొన్నారు. తూర్పు లద్ధాఖ్‌లోని ఇండియా భూభాగమైన ఫింగర్ 4 వద్ద మన సైనిక పోస్టు ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన సైనిక బలగాలు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3 వద్దకు వచ్చేశాయని అన్నారు. మన ప్రాంతాన్ని చైనాకు ఎందుకు ఇచ్చారో ప్రధానమంత్రి, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెనక్కి మళ్లాలని మన సైన్యాన్ని ఎందుకు ఆదేశించారని అన్నారు. దీనివల్ల మనకు లాభమేంటి? అని ప్రశ్నించారు. వ్యూహాత్మక ప్రాంతాల నుంచి చైనా ఎందుకు వెనక్కి వెళ్లడం లేదన్నారు. దేశ భూభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment