కాకినాడ సిటీ : రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు హామీలను నెలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కదం తొక్కారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఇక్కడకు తరలివచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఎన్నికలకు ముందు ఓమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మార్చిన టీడీపీ.. హామీల అమలులో కాలయాపన చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించిన రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ దశలో కలెక్టరేట్ గేటును తోసి లోపలికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు అత్యుత్సాహంతో లాఠీలతో గేట్లపై కొట్టారు. ఈ క్రమంలో సంఘ నాయకుడు కుమారస్వామికి చేతివేలికి గాయం కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు రైతు నాయకులు వినతిపత్రం అందజేసి, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు.
రైతులు ఆగ్రహించి కోనసీమలో పంట విరామమే కాదు ఈల్డ్‌డౌన్ కూడా ప్రారంభించారని చెప్పారు. ఇది రాష్ట్రమంతా చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే కోనసీమలో 20 నుంచి 30 శాతం భూములు వరిపంటకు దూరమయ్యాయని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ లాభసాటి ధర నిర్ణయించే వ్యవస్థను తీసుకురావాలని, ప్రత్యేక వ్యవసాయ పంటల బీమా చట్టం తేవాలన్నారు. గతేడాది బీమా క్లెయింలను వెంటనే రైతులకు చెల్లించాలని, ఈ సొమ్మును రుణమాఫీ పథకానికి మళ్లించరాదని డిమాండ్ చేశారు. కాజులూరు మండలం తణుకువాడలో కూడా రైతులు ఆందోళన చేశారు.
ఆదర్శ రైతుల ఆందోళన
ఆదర్శరైతు వ్యవస్థను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదర్శ రైతులకు రాజకీయ కార్యకర్తలుగా ముద్రవేసి తొలగించడం ప్రభుత్వానికి తగదని, ఆ జీఓ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదర్శ రైతులను రోడ్డున పడేయడం దారుణమని ఆదర్శ రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పుచ్చకాయల ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆదర్శరైతు వ్యవస్థను సమీక్షిస్తానని చెప్పిన చంద్రబాబు వస్తే జాబు వస్తుందని నమ్మకాన్ని కలిగించి, ఇప్పడు ఆ వ్యవస్థనే రద్దు చేయడం సమంజసం కాదన్నారు. అవసరమైతే అనర్హులను, అవినీతి ఆరోపణలున్న వారిని తొలగించాలి మినహా రద్దు చేయడం తగదన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రి వీరాంజనేయరెడ్డి, నాయకులు ఆదిత్యరెడ్డి పాల్గొన్నారు.
కదం తొక్కిన రైతులు
Published Tue, Sep 23 2014 12:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement