చింతకొమ్మదిన్నె : రుణమాఫీపై ప్రభుత్వం పలు రకాలుగా ప్రకటనలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చింతకొమ్మదిన్నె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీజీబీలో 2012లో రైతులు తమ బంగారుతోపాటు పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్ ఇచ్చి పంట రుణం తీసుకున్నారన్నారు. మళ్లీ బ్యాంకు వారి సూచన మేరకు 2013లో వడ్డీలు చెల్లించి పంట రుణాలను రెన్యువల్ చేశారన్నారు.
కానీ బ్యాంకు అధికారులు రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఈ రుణాలను పశువులకు, గొర్రెలకు, పెరటికోళ్ల వంటి మధ్యకాలిక రుణంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను గాలికి వదిలి రైతులబతుకులతో ఆడుకుంటోందని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉండకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పి.శివారెడ్డి, జిల్లా కార్యదర్శి సి.మాధవరెడ్డి, ప్రాంత కార్యదర్శి బొగ్గుల ఓబుల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా వెంకటరెడ్డి, మండలశాఖ ప్రధాన కార్యదర్శి బుసిరెడ్డి మల్లారెడ్డి, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
రుణమాఫీ ప్రకటనలపై ఆగ్రహించిన రైతులు
Published Tue, Sep 9 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement