-అమలాపురంలో రౌండ్‌టేబుల్ సమావేశానికి అవాంతరాలు
-ప్రతిఘటించిన అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు
అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా)
అమలాపురం పోలీసులు మరోసారి రైతులపై జులుం ప్రదర్శించారు. గతంలో ఖరీఫ్ సాగుకు విరామం ప్రకటించడంపై చర్చించడానికి నిర్వహించిన సమావేశాన్ని అడ్డుకున్నట్టే రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిలిపివేయబోయారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం అమలాపురం జనహిత కార్యాలయంలో పట్టాదారుపాస్ పుస్తకాల రద్దు నిర్ణయంపై అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
అధికార టీడీపీకి చెందిన రైతు సంఘాల ప్రతినిధులతోపాటు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు, బీకేఎస్‌తోపాటు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా సిబ్బందితో వచ్చిన అమలాపురం పట్టణ ఎస్సై కె.విజయశంకర్ సమావేశం నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వి.నాయుడు చేతిలో మైకును లాగేసుకున్నారు. ఆ క్రమంలో మైకు విరిగి, పనిచేయకుండా పోయింది. ‘సెక్షన్-30 అమలులో ఉంది. అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు? తక్షణం ఖాళీ చేసి వెళ్లిపోండి’ అని హకుం జారీచేశారు.
ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘మేము సదస్సు నిర్వహించుకోవడానికి కూడా మీ అనుమతి అవసరమా? రైతుల సమస్యలపై చర్చించడమే నేరమా?’ అంటూ ప్రతిఘటించారు. పోలీసు జులుం నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘మేము ఉద్యమాల కోసం సమావేశాలు నిర్వహించడం లేదు. శాంతియుతంగా పట్టాదారుపాస్ పుస్తకాల రద్దుపై చర్చిస్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు. అనుమతి లేనందున సమావేశం అడ్డుకుంటామని ఎస్సై చెప్పగా నిర్వహించి తీరుతామని రైతులు, రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ఎస్సై, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయూరు. కాగా పోలీసుల తీరుకు నిరసనగా సమావేశం అనంతరం కూడా రైతులు నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు.