the Round Table Conference
-
రైతులపై పోలీసు జులుం
-అమలాపురంలో రౌండ్‌టేబుల్ సమావేశానికి అవాంతరాలు -ప్రతిఘటించిన అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా) అమలాపురం పోలీసులు మరోసారి రైతులపై జులుం ప్రదర్శించారు. గతంలో ఖరీఫ్ సాగుకు విరామం ప్రకటించడంపై చర్చించడానికి నిర్వహించిన సమావేశాన్ని అడ్డుకున్నట్టే రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిలిపివేయబోయారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం అమలాపురం జనహిత కార్యాలయంలో పట్టాదారుపాస్ పుస్తకాల రద్దు నిర్ణయంపై అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అధికార టీడీపీకి చెందిన రైతు సంఘాల ప్రతినిధులతోపాటు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు, బీకేఎస్తోపాటు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా సిబ్బందితో వచ్చిన అమలాపురం పట్టణ ఎస్సై కె.విజయశంకర్ సమావేశం నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వి.నాయుడు చేతిలో మైకును లాగేసుకున్నారు. ఆ క్రమంలో మైకు విరిగి, పనిచేయకుండా పోయింది. ‘సెక్షన్-30 అమలులో ఉంది. అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు? తక్షణం ఖాళీ చేసి వెళ్లిపోండి’ అని హకుం జారీచేశారు. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘మేము సదస్సు నిర్వహించుకోవడానికి కూడా మీ అనుమతి అవసరమా? రైతుల సమస్యలపై చర్చించడమే నేరమా?’ అంటూ ప్రతిఘటించారు. పోలీసు జులుం నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘మేము ఉద్యమాల కోసం సమావేశాలు నిర్వహించడం లేదు. శాంతియుతంగా పట్టాదారుపాస్ పుస్తకాల రద్దుపై చర్చిస్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు. అనుమతి లేనందున సమావేశం అడ్డుకుంటామని ఎస్సై చెప్పగా నిర్వహించి తీరుతామని రైతులు, రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ఎస్సై, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయూరు. కాగా పోలీసుల తీరుకు నిరసనగా సమావేశం అనంతరం కూడా రైతులు నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. -
నీటి వాటా తెచ్చుకోకుంటే ఎడారే
బీకేఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కడప అగ్రికల్చర్: రాయలసీమకు రావాల్సిన నీటి వాటాలను తెచ్చుకోకపోతే ఏడారిగా మారక తప్పదని రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హెచ్చరించారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రాయలసీమ రైతు సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన పూర్తై తరువాత తీవ్రంగా నష్టపోతున్నది రాయలసీమేనన్నారు. బీకేఎం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తీవ్ర వర్షాభావంతో బోరుబావులు, చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో తాగ టానికి కూడా నీరు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు సిద్ధారెడ్ది మాట్లాడుతూ రాయలసీమకు సాగు నీటి పంపిణీ విడుదలలో తీవ్ర అన్యాయం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బీకేఎం అధ్యక్షుడు నీలకంఠారెడ్డి మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి గండం ఏర్పడిందన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు సాగు, తాగునీటి విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర విభజన సమయంలోనే చెప్పామన్నారు. ఇప్పటికైనా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రాయలసీమకు రావాల్సిన నీటి వాటాల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇరవై సూత్రాల ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 2500 కోట్లు కేటాయించుకునేందుకు ఒత్తిడి తీసుకురాావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సమావేశంలో చిత్తూరు జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు బీవీ శివారెడ్డి, బీకేఎస్ రాష్ట్ర నాయకులు బొగ్గుల ఓబులరెడ్డి, కుమారస్వామి, వెంకటశివారెడ్డి, రాయలసీమ సాధన సమితి గౌరవాధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి, నాయకులు ఇరగంరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ నాయకుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కమలాపురం నాయకులు సోమశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
ఇఫ్లూ విద్యార్థుల రస్టిగేషన్ను రద్దు చేయాలి
వర్సిటీల్లో ఇలాంటి చర్య ఉండకూడదు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సుందరయ్య విజ్ఞానకేంద్రం, న్యూస్‌లైన్ : ఇఫ్లూ విద్యార్థులైన మోహన్ ధరావత్, సతీష్ నయనాల, సుభాష్‌లపై విధించిన రస్టిగేషన్ను తొలగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డ ఇఫ్లూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సునయన సింగ్‌ను తొలగించాలని, వర్సిటీల్లో రస్టిగేషన్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో స్టూడెంట్స్ ఫోరం ఫర్ జస్టిస్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇఫ్లూ విద్యార్థులపై విధించిన రస్టిగేషన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకుమార్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.గోవర్ధన్, టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ సుధాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించా రు. కోదండరామ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో రస్టిగేషన్ వంటి చర్య అనేదే ఉండకూడదని, ఇలాంటి చర్యలు అప్రజాస్వామిక వాతావరణానికి దారి తీస్తాయని అన్నారు. ఇఫ్లూ విద్యార్థులపై రస్టిగేషన్ను విధించడం సరైంది కాదన్నారు. ఒకవేళ ఘర్షణ లాంటి వాతావరణం చోటు చేసుకుంటే సమస్య పరిష్కారానికి అవసరమయ్యే విధంగా చర్చించాలే తప్ప విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోరాదని అన్నారు. యూనివర్సిటీలను అప్రజాస్వామిక వేదికలుగా మార్చరాదని, ఇలాంటి వాతావరణం యూనివర్సిటీల ఎదుగుదలకు దోహదపడదని అన్నారు. సమస్య పరిష్కా రం కాకుంటే ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని సూచించారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ.. వర్సిటీల్లో నియంతృత్వ ధోరణులు కొనసాగడం సరైంది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఆధిపత్య కూడళ్లను కొల్లగొట్టగల శక్తి విద్యార్థులకే ఉందని ఆయన అన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ.. ఇఫ్లూ సమస్యను సామాజిక సమస్యగా గుర్తించాలన్నారు. ఇఫ్లూ విద్యార్థులపై క్రమశిక్ష ణ చర్యలో భాగంగా రస్టిగేషన్ను విధించడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఇఫ్లూ యూనివర్సి టీ వీసీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదకుమార్ మాట్లాడుతూ రెండు దినాల్లో సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కె.గోవర్దన్ మాట్లాడుతూ వీసీ హిట్లర్‌గా వ్యవహరిస్తున్నారని, నిరంకుశ పోకడలకు కారణమైన వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు విజయ్, ఉపేందర్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు వి. సంధ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు ఎం. శ్రీనివాస్, జి. ఝాన్సీ, సీపీఎం నాయకులు మల్లారెడ్డి, ఎస్.ఎల్ పద్మ, జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, విద్యార్థి సంఘాల నాయకులు స్టాలిన్, రంజిత్, డేవిడ్, భాస్కర్ పాల్గొన్నారు. 18న చలో రాజ్‌భవన్ రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం వివిధ ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థి, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. 26న వీసీ దిష్టిబొమ్మ దహనం, 28న అమరవీరుల స్థూపాల వద్ద నిరసన, 31న అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం, జూన్ 4న ఇందిరాపార్కు వద్ద ధర్నా, 18న చలో రాజ్‌భవన్ కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.