ఇఫ్లూ విద్యార్థుల రస్టిగేషన్‌ను రద్దు చేయాలి
- వర్సిటీల్లో ఇలాంటి చర్య ఉండకూడదు
- తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్
సుందరయ్య విజ్ఞానకేంద్రం, న్యూస్‌లైన్ : ఇఫ్లూ విద్యార్థులైన మోహన్ ధరావత్, సతీష్ నయనాల, సుభాష్‌లపై విధించిన రస్టిగేషన్‌ను తొలగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డ ఇఫ్లూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సునయన సింగ్‌ను తొలగించాలని, వర్సిటీల్లో రస్టిగేషన్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో స్టూడెంట్స్ ఫోరం ఫర్ జస్టిస్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇఫ్లూ విద్యార్థులపై విధించిన రస్టిగేషన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీఎన్‌జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకుమార్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.గోవర్ధన్, టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ సుధాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించా రు.
కోదండరామ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో రస్టిగేషన్ వంటి చర్య అనేదే ఉండకూడదని, ఇలాంటి చర్యలు అప్రజాస్వామిక వాతావరణానికి దారి తీస్తాయని అన్నారు. ఇఫ్లూ విద్యార్థులపై రస్టిగేషన్‌ను విధించడం సరైంది కాదన్నారు. ఒకవేళ ఘర్షణ లాంటి వాతావరణం చోటు చేసుకుంటే సమస్య పరిష్కారానికి అవసరమయ్యే విధంగా చర్చించాలే తప్ప విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోరాదని అన్నారు. యూనివర్సిటీలను అప్రజాస్వామిక వేదికలుగా మార్చరాదని, ఇలాంటి వాతావరణం యూనివర్సిటీల ఎదుగుదలకు దోహదపడదని అన్నారు. సమస్య పరిష్కా రం కాకుంటే ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని సూచించారు.
చుక్కా రామయ్య మాట్లాడుతూ.. వర్సిటీల్లో నియంతృత్వ ధోరణులు కొనసాగడం సరైంది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఆధిపత్య కూడళ్లను కొల్లగొట్టగల శక్తి విద్యార్థులకే ఉందని ఆయన అన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ.. ఇఫ్లూ సమస్యను సామాజిక సమస్యగా గుర్తించాలన్నారు. ఇఫ్లూ విద్యార్థులపై క్రమశిక్ష ణ చర్యలో భాగంగా రస్టిగేషన్‌ను విధించడం అప్రజాస్వామికమని విమర్శించారు.
ఇఫ్లూ యూనివర్సి టీ వీసీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదకుమార్ మాట్లాడుతూ రెండు దినాల్లో సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కె.గోవర్దన్ మాట్లాడుతూ వీసీ హిట్లర్‌గా వ్యవహరిస్తున్నారని, నిరంకుశ పోకడలకు కారణమైన వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులు విజయ్, ఉపేందర్‌ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు వి. సంధ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు ఎం. శ్రీనివాస్, జి. ఝాన్సీ, సీపీఎం నాయకులు మల్లారెడ్డి, ఎస్.ఎల్ పద్మ, జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, విద్యార్థి సంఘాల నాయకులు స్టాలిన్, రంజిత్, డేవిడ్, భాస్కర్ పాల్గొన్నారు.
18న చలో రాజ్‌భవన్
రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం వివిధ ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థి, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. 26న వీసీ దిష్టిబొమ్మ దహనం, 28న అమరవీరుల స్థూపాల వద్ద నిరసన, 31న అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం, జూన్ 4న ఇందిరాపార్కు వద్ద ధర్నా, 18న చలో రాజ్‌భవన్ కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.