మిశ్రమ పంటలతో మేలు | benefits with Mixed crops | Sakshi
Sakshi News home page

మిశ్రమ పంటలతో మేలు

Published Tue, Sep 16 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

మిశ్రమ పంటలతో మేలు

మిశ్రమ పంటలతో మేలు

మిశ్రమ పంటలతో మేలైన ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి, ఆదర్శరైతు (98852 63924) ముత్యాల జమ్మీలు(జమ్మీ). కొబ్బరిలో అంతర పంటలుగా ఆయన అరటి, కోకో, పోక, మిరియాలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మిశ్రమ పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు. కొబ్బరిలో అంతరపంటల సాగుపై ఇస్తున్న కథనాల్లో భాగంగా రెండో కథనంలో మిశ్రమ పంటల సాగు పద్ధతి ఎలా చేపట్టాలో ఆయన వివరిస్తున్నారు. ఆ విశేషాలు
 
ఆయన మాటల్లోనే...
‘‘కొబ్బరి సాగుకు పెట్టుబడి పెరుగుతోంది తప్ప తగిన రాబడి లేదు. అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటలను సాగు చేస్తేమరింత ఆదాయం వస్తుంది. ఏటా కొబ్బరి సాగుకు ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. రాబడి సైతం దీనిలో కోకో, అరటి, పోక, మిరియం పంటలను అంతర పంటలుగా సాగు చేయడం వల్ల నాకు అయ్యే అదనపు పెట్టుబడి ఏడాదికి రూ.22,500 మాత్రమే. కాని ఆయా పంటల దిగుబడి ద్వారా ఖర్చులు పోను నాకు వచ్చే అదనపు లాభం (కొబ్బరితో సంబంధం లేకుండా) ఎకరాకు రూ.75 వేలు. కోకో తోట వయస్సు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగి లాభం మరింత పెరుగుతుంది. ’’
 
కోకో                                                      .
మా కుటుంబానికి ఉన్న కొబ్బరి తోటల్లో సగం తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నా. కొబ్బరి వయస్సు 60 ఏళ్లయితే, కోకోది సుమారు 40 ఏళ్లు. ఈ కారణంగా ఏటా ఈ రెండు పంటలకు యాజమాన్య పద్ధతులకు అంటే దుక్కులు, ఎరువులు, నీరు పెట్టడం వంటి చిన్నచిన్న పెట్టుబడులు సరిపోతాయి. కోకోలో అదనంగా కొమ్మల కత్తిరింపునకు మాత్రమే పెట్టుబడి అవుతోంది. కాని ఈ రెండు పంటల ద్వారా దీర్ఘకాలికంగా ఆదాయం పొందవచ్చు.

* ఎకరా కొబ్బరి తోటలో నాలుగు చెట్ల మధ్య కోకో మొక్కను వేశాను. నాలుగేళ్ల క్రితం మొక్కలు పాతితే గత ఏడాది నుంచి దిగుబడి వస్తోంది. ఎకరాకు 180 మొక్కలు నాటాను.
* పక్వానికి వచ్చే కోకో కాయలను వారానికి ఒకసారి కోస్తాను. తరువాత గుజ్జుతీసి పిక్కలను ముందు పులియబెట్టి, తరువాత నాలుగు రోజులు పాటు ఎండలో పెట్టి పిక్కలను విక్రయిస్తాను.
* కోకో గింజలను సీజన్‌లో కేజీ రూ.210 చేసి అమ్మకాలు చేశాం. ఇప్పుడు అన్‌సీజన్ కావడం వల్ల రూ.160 మాత్రమే ధర ఉంది. ఎకరాకు ఎంతలేదన్నా కొబ్బరితో సంబంధం లేకుండా రూ.25 వేల వరకు ఆదాయం వస్తోంది.
* అదే 15 ఏళ్లకు పైబడి తోట ఉన్న రైతులకు నాలుగైదు రెట్లు దిగుబడిగా వస్తోంది. అటువంటి తోట ఉన్న రైతులు ఎకరాకు ఏడాదికి రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశముంది.

 పెట్టుబడి                                                 .
* కొబ్బరికి చేసే దమ్ములు కోకోకు సరిపోతాయి. ఫ్రూనింగ్ (కొమ్మలు కత్తిరింపునకు) ఏడాదికి ఎకరాకు రూ.500 అవుతోంది.
* ఏడాదికి రెండుసార్లు (జూలై, అక్టోబర్) యూరియా, పొటాష్, సూపర్ మందును కేజీ చొప్పున చెట్టుకు వచ్చి మూడు కేజీల చొప్పున అందిస్తున్నా. ఎరువుల ధరలు, చెట్టు కుదళ్లు కొట్టే కూలీలకు కలిపి ఎకరాకు రూ.నాలుగు వేలు పెట్టుబడి అవుతోంది.
* చెట్టును ఆశించే తెగుళ్ల నివారణకు మరో రూ. వెయ్యి వరకు అవుతోంది. మొత్తం మీద ఎకరాకు రూ.5,500 పెట్టుబడి అవుతుంటే, రూ. 25 వేల వరకు ఆదాయంగా వస్తోంది.

 అరటి                                        .
* కొబ్బరి, కోకో సాగవుతున్న రెండు ఎకరాల్లో అరటిని కూడా అంతర పంటగా సాగు చేశాను. కొబ్బరి చెట్లు, కోకో చెట్ల మధ్య వరుసగా అరటి చెట్లు వేశాం. ఎకరాకు 400 మొక్కల వరకు వేశాం.
* దక్కులు ఎలాను కొబ్బరి తోటకు చేయిస్తున్నందున దీనికి పెట్టుబడి కొంత వరకు కలసి వస్తోంది. కానీ ఏడాదికి మూడుసార్లు కలుపు తీయించాల్సి ఉంది. చెట్టు ఖరీదు, ఎరువులు, ఇతర యాజమాన్య పద్ధతులకు వచ్చి రూ.40 వరకు పెట్టుబడి అయ్యింది. గెల రూ.90 చేసి అమ్మకాలు చేసినందున పెట్టుబడి పోను చెట్టుకు రూ.50 చొప్పున ఎకరాకు రూ.20 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది.

 పోక                                                       .
* కొబ్బరి తోట చుట్టూ పోక చెట్లు వేశాను. అలాగే తోటకు నీరు వెళ్లే బోదెల గట్లకు ఇరువైపులా కూడా పోకచెట్లు నాటాను. దగ్గర, దగ్గరగా మొక్కలు పాతుకుంటే ఎకరాకు 400 వరకు మొక్కలు నాటవచ్చు.  
*పోకకు పెద్దగా పెట్టుబడి పెట్ట లేదు. కోకో మొక్కలకు ఎరువులు వేసినప్పుడే వీటికి కూడా ఏడాదికి రెండు దఫాలుగా యూరియా, సూపర్, పొటాష్ ఎరువులు వేశాం. చెట్టుకు వచ్చి విడతకు అరకేజీ చొప్పున వేశా. ఎకరాకు రూ.వెయ్యి వరకు పెట్టుబడి అయ్యింది.
* పోక వల్ల ఏడాదికి  రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయంగా వస్తోంది.

మిరియం                                                .
ఏజెన్సీల్లోనే కాదు.. మన కొబ్బరి తోటల్లో కూడా మిరియాన్ని అంతర పంటగా సాగు చేయవచ్చు. దీనిని మా తోటలో ప్రయోగ్మాతంగా సాగు చేస్తున్నా. బోదెను అనుకుని ఉన్న 15 పోక చెట్ల మీద మిరియం తీగను ఎక్కించాను. గత ఏడాది చాలా తక్కువ దిగుబడి వచ్చింది. దీనిని మా ఇంటి అవసరాల కోసం వినియోగించాను. అయితే ఈ ఏడాది మిరియం గుత్తులు ఎక్కువ వేసింది. కనీసం ఏడెనిమిది కేజీలకు పైబడి దిగుబడిగా వచ్చే అవకాశముంది. మార్కెట్ ధరను బట్టి చూస్తే కనీసం రూ.పది వేల వరకు ఆదాయం రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement