indefinite hunger strikes
-
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
లోక్‌పాల్ కోసం అన్నా హజారే నిరశన
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవినీతికి వ్యతి రేకంగా హాజారే ఏడేళ్ల కింద ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించి, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేయడం తెల్సిందే. రామ్‌లీలా మైదానంలో శుక్రవా రం ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఈసారి ఆయన టార్గెట్‌గా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కనిపిస్తోంది. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచే అన్నా హజారే డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం నిరాహార దీక్ష
రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా... భోపాల్: నిరసన, నిరాహార దీక్షలు చేపడుతున్న సీఎంల జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆపన్న హస్తం అందించలేదని ఆరోపిస్తూ రాజధాని భోపాల్‌లో తన సహచర మంత్రులతో కలిసి గురువారం ఆయన నాలుగు గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి మధ్యప్రదేశ్ రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తమ మంత్రివర్గం మొత్తం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించేందుకు కూడా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తుపాను, అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికే తాము రూ.2వేల కోట్లతో ఆదుకున్నామని, ఇది ఇంతటితో ఆగబోదని మరింత సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ. 7.42 కోట్లను కూడా రైతులకు అందించామని పేర్కొన్నారు. శాశ్వత జాతీయ విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో జరిపిన తన పర్యటనను సైతం విపక్ష కాంగ్రెస్ రాజకీయం చేసిందని విరుచుకుపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం దక్కేలా కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని సరళీకరించాలని ఈ సందర్భంగా కోరారు. -
దీక్షలు విరమించి, బంద్‌ను విజయవంతం చేయండి: వైఎస్సార్సీపీ
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తలు వెంటనే తమ దీక్షలు విరమించాల్సిందిగా ఆ పార్టీ ముఖ్య నేతలు సూచించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వైఎస్సార్ సీపీ 72గంటల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ సమన్వయ కర్తలందరూ బంద్‌ను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షలు విరమించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్తల స్థానంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ ముఖ్య నేతలు సూచించారు. గురువారం నాడు న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ రాష్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. -
జగన్‌కు జనం అండ
సాక్షి నెట్వర్క్: జననేత జగన్మోహన్రెడ్డి దీక్షకు సంఘీభావంగా మూడురోజులకిందట సీమాంధ్ర జిల్లాల్లో 108 మంది చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరాలు కొనసాగుతుండగా, మంగళవారం తాజాగా 14మంది నిరవధిక నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఒక్కరోజే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2169మంది రిలేదీక్షలు చేపట్టారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా మంగళవారం 300మంది రిలేదీక్షలు చేపట్టగా, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆత్మకూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల దీక్షలు బుధవారంతో మూడోరోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లాలో 31 మంది ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా, వీరికి మద్దతుగా 152 మంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలో మాజీమంత్రి షాకీర్, వైఎస్సార్ సీపీ నేతలు జీవీ సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు బుధవారం నాలుగోరోజుకు చేరాయి. విజయనగరంలో అవనాపు విజయ్‌తో సహా ఏడుగురు నేతలు చేపట్టిన నిరశన దీక్షలు మూడోరోజుకు చేరగా, మంగళవారం 96మంది రిలేదీక్షలు చేపట్టారు. తిరుపతిలో గంగమ్మకు పొంగళ్లు పెట్టి వైఎస్ జగన్‌కు ఆరోగ్యం బాగుండాలని మహిళలు మొక్కుకున్నారు. కృష్ణా జిల్లాలో పెడన మాజీఎమ్మెల్యే జోగిరమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యువనేత జక్కంపూడి రాజా, మల్కిపురంలో కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన ఆమరణ దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, శ్రీకాకుళం జిల్లాలో 100 మంది మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా దాదాపు 150 మంది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఒంగోలులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబుతో సహా ముగ్గురు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖనగరంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగరతీరంలో జలదీక్షకు దిగారు. వెఎస్సార్ జిల్లాలో ఏడుగురి ఆమరణ దీక్షలు కొనసాగుతుండగా, మంగళవారం 208మంది రిలేదీక్షలు చేపట్టారు.