జగన్‌కు జనం అండ
సాక్షి నెట్‌వర్క్: జననేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు సంఘీభావంగా మూడురోజులకిందట సీమాంధ్ర జిల్లాల్లో 108 మంది చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరాలు కొనసాగుతుండగా, మంగళవారం తాజాగా 14మంది నిరవధిక నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఒక్కరోజే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2169మంది రిలేదీక్షలు చేపట్టారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా మంగళవారం 300మంది రిలేదీక్షలు చేపట్టగా, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆత్మకూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల దీక్షలు బుధవారంతో మూడోరోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లాలో 31 మంది ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా, వీరికి మద్దతుగా 152 మంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలో మాజీమంత్రి షాకీర్, వైఎస్సార్ సీపీ నేతలు జీవీ సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు బుధవారం నాలుగోరోజుకు చేరాయి. విజయనగరంలో అవనాపు విజయ్‌తో సహా ఏడుగురు నేతలు చేపట్టిన నిరశన దీక్షలు మూడోరోజుకు చేరగా, మంగళవారం 96మంది రిలేదీక్షలు చేపట్టారు.
తిరుపతిలో గంగమ్మకు పొంగళ్లు పెట్టి వైఎస్ జగన్‌కు ఆరోగ్యం బాగుండాలని మహిళలు మొక్కుకున్నారు. కృష్ణా జిల్లాలో పెడన మాజీఎమ్మెల్యే జోగిరమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యువనేత జక్కంపూడి రాజా, మల్కిపురంలో కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన ఆమరణ దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా, శ్రీకాకుళం జిల్లాలో 100 మంది మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా దాదాపు 150 మంది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఒంగోలులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబుతో సహా ముగ్గురు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖనగరంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగరతీరంలో జలదీక్షకు దిగారు. వెఎస్సార్ జిల్లాలో ఏడుగురి ఆమరణ దీక్షలు కొనసాగుతుండగా, మంగళవారం 208మంది రిలేదీక్షలు చేపట్టారు.