మధ్యప్రదేశ్ సీఎం నిరాహార దీక్ష
రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా...
భోపాల్: నిరసన, నిరాహార దీక్షలు చేపడుతున్న సీఎంల జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆపన్న హస్తం అందించలేదని ఆరోపిస్తూ రాజధాని భోపాల్‌లో తన సహచర మంత్రులతో కలిసి గురువారం ఆయన నాలుగు గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి మధ్యప్రదేశ్ రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తమ మంత్రివర్గం మొత్తం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించేందుకు కూడా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
తుపాను, అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికే తాము రూ.2వేల కోట్లతో ఆదుకున్నామని, ఇది ఇంతటితో ఆగబోదని మరింత సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ. 7.42 కోట్లను కూడా రైతులకు అందించామని పేర్కొన్నారు. శాశ్వత జాతీయ విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో జరిపిన తన పర్యటనను సైతం విపక్ష కాంగ్రెస్ రాజకీయం చేసిందని విరుచుకుపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం దక్కేలా కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని సరళీకరించాలని ఈ సందర్భంగా కోరారు.