సింగూ సరిహద్దు వద్ద పెద్దసంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానంలో శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వేలాది మంది పంజాబ్, హరియాణా రైతులు శనివారం ఢిల్లీ శివార్లలోని సింగూ, టిక్రీ సరిహద్దులోనే బైఠాయించారు.
సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవర్చే వరకూ ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వంట పాత్రలు సైతం తెచ్చుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలు, వాహనాల్లోనే నిద్రిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారు లెక్కచేయడం లేదు. ఆదివారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్జీత్‌సింగ్ మహల్ చెప్పారు.
పంజాబ్, హరియాణా రైతులకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్ రైతులు కూడా ఘాజీపూర్ సరిహద్దు వద్ద బైఠాయించారు. ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ–మీర్జాపూర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైతులు ధర్నా చేయాలనుకుంటే ఉత్తర ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లాలని జాయింట్ కమిషనర్ సురేందర్ సింగ్ యాదవ్ సూచించారు. అయితే, జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సంత్ నిరంకారీ గ్రౌండ్‌లో రైతుల నిరసన కొనసాగుతోంది. శనివారం రైతుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3న రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.
ఉద్యమం వెనుక పంజాబ్ సీఎం
కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కార్యాలయ సిబ్బంది రైతులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అక్కడికి వెళ్తే చర్చలకు సిద్ధం: అమిత్ షా
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న రైతులు ఢిల్లీలోని సంత్ నిరంకారీ గ్రౌండ్‌కు వెళ్లాలని హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అక్కడే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయవచ్చని చెప్పారు. తాము సూచించిన ప్రాంతానికి వెళ్లిన రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ శివార్లలో బైఠాయించిన రైతులు తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే వెంటనే నిరంకారీ మైదానానికి వెళ్లాలని అమిత్ షా హోంశాఖ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment