సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్‌కు 20కి పైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణాల్లో పార్టీలకు అతీతంగా 31 రైతు సంఘాలు ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నాయి. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐఎఫ్‌యూ), భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అఖిల భారత కిసాన్ మహాసంఘ్ (ఏఐకేఎం) వంటి రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పలు రైతు సంఘాలు షట్‌డౌన్‌కు పిలుపు ఇవ్వగా భారత్ బంద్‌కు ఏఐటీయూసీ, సీఐటీయూ, హిందూ మజ్ధూర్ సభ వంటి పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
మద్దతు ధర, ఆహార భద్రతను బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ల గుప్పిట్లో పెడితే దేశవ్యాప్తంగా అలజడి రేగుతుందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ బిల్లులను తిప్పిపంపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను అడ్డుకోవాలని 18 విపక్ష పార్టీలు బుధవారం రాష్ట్రపతిని కలిసి విన్నవించాయి. సభ పున:పరిశీలనకు వ్యవసాయ బిల్లులను వెనక్కిపంపాలని విపక్షాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థించాయి. వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కనీస మద్దతు ధర లేకపోవడమే కాకుండా వ్యవసాయ మార్కెట్‌లు కనుమరుగవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ బిల్లులు రైతులకు మేలు చేకూరుస్తాయని దళారీలు లేకుండా మెరుగైన ధరకు పంటను అమ్ముకునే వెసులుబాటు రైతులకు అందివస్తుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : భారత్ బంద్ : పోలీసు వాహనాలకు నిప్పు
Comments
Please login to add a commentAdd a comment