ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద ఆహారం తింటున్న రైతులు
న్యూఢిల్లీ: చలిగాలులకు వర్షం తోడవడంతో ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రంతా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నిత్యావసరాలు తడిసిపోయాయి. వాటర్ ప్రూఫ్ టెంట్లలోకి కూడా నీరు చేరింది. దుప్పట్లు, దుస్తులు, వంటచెరకు తడిచిపోయాయి. ‘వర్షం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. వర్షం తరువాత చలి కూడా బాగా పెరిగింది. అయినా, మా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదు’ అని రైతు నేత అభిమన్యు కోహర్ తెలిపారు. ‘ప్రతికూల వాతావరణం కూడా మా స్ఫూర్తిని దెబ్బతీయలేదు.
ఎన్ని కష్టాలొచ్చినా మా డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడి నుంచి కదలం’ అని సింఘు బోర్డర్లో ఆందోళనల్లో పాల్గొంటున్న గుర్వీందర్ సింగ్, ఘజీపూర్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న ధరమ్‌వీర్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, జూన్ 6వ తేదీ వరకు వడగళ్లతో కూడిన వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘ఇది పంజాబ్‌లో గోధుమ పంట వేసే సమయం. అక్కడ రాత్రి, తెల్లవారు జామున కూడా పొలాల్లో పని చేస్తుంటాం. ఇక్కడి కన్నా అక్కడ ఎక్కువ చలి ఉంటుంది. చలి కన్నా వర్షం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం’ అని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ జాయింట్ సెక్రటరీ సుఖ్వీందర్ సింగ్ తెలిపారు.
రాజ్‌నాథ్‌తో తోమర్ భేటీ
రైతులతో నేడు(సోమవారం) చర్చలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ మంత్రి రాజ్‌నాథ్‌తో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చర్చల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం ముందున్న మార్గాలు తదితరాలపై వారిరువురు చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాజ్‌పేయి ప్రభుత్వంలో రాజ్‌నాథ్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలకు ముగింపు పలికే దిశగా తెరవెనుక క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.
ఇంత అహంకారమా?
స్వాతంత్య్రం తరువాత అధికారంలోకి వచ్చిన అత్యంత అహంకార పూరిత ప్రభుత్వం ఇదేనని మోదీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మండిపడ్డారు. అన్నదాతల కష్టాలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగబోవని వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి, అహం పక్కనపెట్టి, బేషరతుగా, ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఇదే రాజధర్మం. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఇదే సరైన నివాళి’ అని ఆదివారం సోనియా ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment