న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై గురువారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులతో చర్చల పేరుతో ఏకపాత్రాభినయం చేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల విమర్శలపై ప్రభుత్వం దీటుగా స్పందించింది. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. రైతులను శత్రువులుగా చూస్తున్నారని, వారి నిరసన కేంద్రాలను దుర్బేధ్య కోటలుగా మారుస్తున్నారని విపక్ష సభ్యులు విమర్శించగా, రైతుల సంక్షేమం కోసం తాము చేపట్టిన చర్యలను ప్రభుత్వం ఏకరువు పెట్టింది.
రైతుల దేశభక్తిని ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి లేదని, ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి వారే కారణమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గురువారం పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు దీపిందర్‌సింగ్ హూడా వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శలను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన నేత జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం రైతుల కోసం, వారి ఆదాయాన్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించిందని వివరించారు. అంతకుముందు, జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లును హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
లక్ష కోట్ల అదనపు ఆదాయం
రైతులకు అదనంగా లక్ష కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభకు తెలిపారు. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా అది సాధ్యం చేస్తామన్నారు. త్వరలోనే ఘాజీపూర్ వద్ద పోగుబడిన వ్యర్థాలను కూడా తరలించి, ఇంధనంగా మారుస్తామన్నారు. ‘గోబర్ ధన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పశువుల పేడ, వ్యవసాయ వర్థాలు, నగరాల్లోని చెత్త, అటవీ వ్యర్థాలు.. వీటన్నింటిని ఇంధనంగా మారుస్తాం. అలా సమకూర్చుకునే దాదాపు లక్షకోట్ల రూపాయలను రైతులకు అందజేస్తాం. తద్వారా రైతుల ఆదాయం పెంచుతాం’అని వివరించారు.
లోక్‌సభ మళ్లీ వాయిదా
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు గురువారం సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, సాగు చట్టాలను రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. 5 గంటలకు సభ మళ్లీ సమావేశమైన తరువాత కూడా విపక్షాలు నిరసన, నినాదాలు కొనసాగించాయి. నిరసనల మధ్యనే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆర్బిట్రేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత సభను స్పీకర్‌స్థానంలో ఉన్న మీనాక్షి లేఖ 6 గంటల వరకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment