
న్యూఢిల్లీ: కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం ప్రారంభమై ఈ నెల 26వ తేదీకి 6 నెలలు అవుతుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజున ‘బ్లాక్ డే’గా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా శనివారం పిలుపునిచ్చింది. 40కి పైగా రైతుల సంఘాల ఐక్యవేదికే ఈ కిసాన్ మోర్చా. ఈనెల 26న ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలను ఎగురవేయాలని, వాహనాలకు నల్లజెండాలు కట్టుకోవాలని రైతు నేత బల్బీర్‌సింగ్ రాజేవాల్ శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు.
వ్యవసాయ చట్టాలకు నిరసనగా ‘చలో ఢిల్లీ’ నినాదంతో రైతులు నవంబరు 26న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారని తెలిపారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు చాలారోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించిన విషయం తెలిసిందే.
కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. అప్పటినుంచి దేశనలుమూలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు, ఘాజీపూర్‌లలోని ధర్నా స్థలాలకు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మే 26తో మోదీ మొదటిసారి అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతుందని రాజేవాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment