నేడు రైతు సంఘ నేతల నిరాహారదీక్ష | Farmer unions to be on hunger strike on December 14 against farm laws | Sakshi
Sakshi News home page

నేడు రైతు సంఘ నేతల నిరాహారదీక్ష

Published Mon, Dec 14 2020 4:57 AM | Last Updated on Mon, Dec 14 2020 11:47 AM

Farmer unions to be on hunger strike on December 14 against farm laws - Sakshi

ఘాజీపూర్‌ రోడ్‌ను బ్లాక్‌ చేసిన రైతులు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘చలో ఢిల్లీ’లో భాగంగా ఢిల్లీ–జైపూర్‌ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం మధ్యాహ్నం నుంచి షాజహాన్‌పూర్‌ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు.

జైపూర్‌ మార్గంలో రాకపోకలకు ఆటంకం
రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్‌ జిల్లా షాజహాన్‌పూర్‌ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, మేథా పాట్కర్, సీపీఎం నేత ఆమ్రా రామ్‌ తదితరులు వీరిలో ఉన్నారు.   రైతుల నిరసనల కారణంగా జైపూర్‌–ఢిల్లీ హైవే ట్రాఫిక్‌ను ఆల్వార్‌ జిల్లా బన్సూర్‌ తదితర మార్గాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఒన్‌వే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.  

ఆందోళనల విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా  రైతు సంఘాల నేతలు సోమవారం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష పాటిస్తారని రైతు సంఘం నేత గుర్నామ్‌ సింగ్‌ చదుని తెలిపారు. దీంతో పాటు సోమ వారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిల్లా వద్ద రైతు ఆందోళనల విరమణపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయంటూ కొన్ని గ్రూపుల నేతలు ఆందోళనలను విరమిస్తున్నారు.  రైతుల పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సాగు చట్టాలు మూడింటిని రద్దు చేయాలనే విషయంలో రైతు సంఘాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి’అని ఆయన ప్రకటించారు.  ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేప ట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు మరో నేత సందీప్‌ గిద్దె తెలిపారు.

చిల్లా మీదుగా రాకపోకలు మొదలు
చిల్లా మీదుగా వెళ్లే నోయిడా– ఢిల్లీ లింక్‌ రోడ్డులోని రవాణా వాహనాలు వెళ్లే ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఇక్కడ రైతులు ధర్నా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, నోయిడాలకు కలిపే డీఎన్‌డీ, కాళిందీ కుంజ్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నిరాటంకంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఆందోళనల్లో సామాన్య మహిళలు
హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెందిన పలువురు సామాన్య గృహిణులు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో చురుగ్గా పాలుపంచు కుంటున్నారు. . ‘వ్యవసాయానికి ఆడామగా తేడా లేదు.చాలా మంది పురుషులు ఇక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. మేమెందుకు ఆందోళనల్లో పాల్గొనకూడదు?’అని లూధియా నాకు చెందిన మన్‌దీప్‌ కౌర్‌అన్నారు.

కాగా, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తదుపరి దఫా చర్చల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి కైలాశ్‌ చౌధరి తెలిపారు. ఈసారి సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య ఐదు రౌండ్ల చర్చలు జరిగినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. 9వ తేదీన జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయిన విషయం తెలిసిందే. రైతు ఆందోళనలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, సోమ్‌ ప్రకాశ్‌ ఆదివారం హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

దీక్షలో నేనూ పాల్గొంటున్నా: కేజ్రీవాల్‌
కేంద్రం అహంకారం వీడి కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. 14వ తేదీన రైతు సంఘాల పిలుపు మేరకు తనతో పాటు ఆప్‌ పార్టీ కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష పాటిస్తారని ఆయన వెల్లడించారు.  రైతుల ఆందోళనలను మావో యిస్టులు, వామపక్ష పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులు హైజాక్‌ చేశాయంటూ కొందరు కేంద్ర మంత్రులు ఆరోపించడంపై ఎన్‌సీపీ తీవ్రంగా స్పందించింది.

పంజాబ్‌ డీఐజీ రాజీనామా
రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేసినట్లు పంజాబ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(జైళ్లు) లఖ్మీందర్‌ సింగ్‌ జాఖర్‌ ఆదివారం ప్రకటించారు. తన రాజీనా మా లేఖను శనివారం రాష్ట్ర ప్రభుత్వా నికి పంపినట్లు వెల్లడించారు. రైతు కుటుంబానికి చెందిన తను, రైతులు శాంతియు తంగా సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

రహదారుల దిగ్బంధంపై 16న సుప్రీం విచారణ
రైతుల నిరసనల కారణంగా వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నారనీ, భారీ సంఖ్యలో రైతులు గుమి గూడుతుండటంతో కోవిడ్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 16న సుప్రీంకోర్టు విచారణ చేప ట్టనుంది. ఢిల్లీ సరిహద్దులను తిరిగి తెరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ వచ్చిన పిటిషన్‌ను ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement