న్యూ ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అటు రైతులు, కావాలంటే సవరణలు చేసైనా సరే అమలు చేస్తామని ఇటు కేంద్రం మొండిపట్టు పడుతోంది. దీంతో కొద్ది రోజులుగా చేపట్టిన రైతుల ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చలు కూడా ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో చర్చలకు రమ్మంటున్న కేంద్రం ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. గతంలో పంపిన సవరణలను ఇప్పటికే తిరస్కరించామని, మళ్లీ వాటిని పంపొద్దు అని కోరాయి. కాలయాపనతో రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని, కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రైతు సంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలతో రావాలని, అప్పుడే తిరిగి చర్చలను ప్రారంభిస్తామని తేల్చి చెప్పాయి. రైతుల ఐక్యవేదిక పేరుతో కేంద్రానికి లేఖ రాశామని, రాత పూర్వక హామీలతో చర్చలకు రావాలని కోరుతున్నామని తెలిపాయి. రైతులు చర్చలకు సిద్ధంగా లేరనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశాయి. తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డాయి. (చదవండి: రైతుల శక్తి అంతింత కాదయ్యా!)
కాగా అంతకుముందు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు మెరుగైన పంట ధర లభించేలా చేస్తామని హామీ ఇచ్చారు. వేర్వేరు పథకాల ద్వారా వ్యవసాయ రంగంలో లోటుపాట్లు సరిదిద్దుతామని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా వ్యవసాయ రంగం ప్రభావితం కాలేదన్నారు. 8 నెలల వ్యవధిలో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా కోటి మంది రైతులకు రూ.లక్ష కోట్ల మేర రుణ సదుపాయం అందించామని తెలుపుతూ దీనికి సహకరించిన బ్యాంకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే కొన్ని సంస్కరణలు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని పేర్కొన్నారు. (చదవండి: చర్చలకు మేము ఎల్లప్పుడూ సిద్ధమే)
Comments
Please login to add a commentAdd a comment