రైతుల రక్తంతో మోదీకి వినతి పత్రం
న్యూఢిల్లీ/ఫతేపూర్: కేంద్ర ప్రభుత్వం రైతులకు తాజాగా రాసిన లేఖలో కొత్తదనం ఏమీ లేదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సరైన పరిష్కార మార్గంతో ముందుకొస్తే చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాల్లోని 7 అంశాల్లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, తదుపరి చర్చలకు తేదీని ఖరారు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ వివేక్ అగర్వాల్ ఆదివారం 40 వ్యవసాయ సంఘాల నేతలకు లేఖ రాశారు.
రైతాంగం కోరినట్లుగా కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) లిఖితపూర్వక హామీ ఇస్తామని వెల్లడించారు. అయితే, సవరణల ప్రతిపాదనపై తాము ఇప్పటివరకు ప్రభుత్వంతో చర్చించలేదని, తాజా లేఖపై ఎలా స్పందించాలన్న విషయంలో రైతు సంఘాల నేతల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయిత్ సోమవారం చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనను తాము గతంలోనే తిరస్కరించామని, లేఖలో కొత్తగా ఏమీ లేదని అన్నారు. తమ డిమాండ్ ఏమిటో ప్రభుత్వానికి తెలియదా? అని మరో నేత అభిమన్యు కోహర్ నిలదీశారు. కొత్త సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
మా గోడు ప్రభుత్వం వినాలి
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు గత 24 రోజులుగా ఢిల్లీ శివార్లలోనే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ గోడును ప్రభుత్వం వినిపించుకోవాలని కోరుతున్నారు. చర్చలకు తాము తేదీని ఖరారు చేయడం కాదని, ప్రభుత్వమే తమకు సమయం కేటాయించాలని, తమ దగ్గరకొచ్చి బాధలేమిటో తెలుసుకోవాలని ఆలిండియా కిసాన్ సమితి(పంజాబ్) సహాయ కార్యదర్శి కశ్మీర్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఒక గట్టి పరిష్కార మార్గంతో ముందుకొస్తే మంచిదని ద్వాబా కిసాన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్‌సింగ్ పేర్కొన్నారు. సర్కారు ప్రతిపాదనలను తాము క్షుణ్నంగా చదివామని, కొత్త చట్టాలను రద్దు చేయాలని మళ్లీ మళ్లీ చెబుతున్నామని వ్యాఖ్యానించారు. తామంతా(సంయుక్త మోర్చా) మంగళవారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని క్రాంతికిరణ్ కిసాన్ యూనియన్ నాయకుడు గుర్మీత్‌సింగ్ వెల్లడించారు. కొత్త చట్టాలతో రైతన్నలకు నష్టం, కార్పొరేట్లకు లాభం కలిగే అవకాశం ఉంది కాబట్టే ప్రభుత్వంతో తమ చర్చలు విఫలమవుతున్నాయని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అంబేడ్కర్ సంఘర్‡్ష మోర్చా హరియాణా రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌సింగ్ స్పష్టం చేశారు.
యూపీలో నిరవధిక రిలే నిరాహార దీక్ష
కొత్త సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా బిండ్‌కీ గ్రామంలో 11 మంది రైతులు ఆదివారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్ష సాగిస్తున్నారు.
సాగు చట్టాలపై కేరళ అసెంబ్లీ తీర్మానం!
ఈ నెల 23వ తేదీన శాసన సభ ప్రత్యేకంగా సమావేశమై నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్లు కేరళలోని వామపక్ష ప్రభుత్వం తెలిపింది.
‘సోషల్ మీడియా మాకు చాలా కీలకం’
కొత్త సాగు చట్టాలపై తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా మద్దతు చాలా కీలకమని రైతులు స్పష్టం చేశారు. రైతుల పోరాటంపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే కిసాన్ ఏక్తా మోర్చా పేజీలను ఫేస్‌బుక్ యాజమాన్యం ఆదివారం సాయంత్రం నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో 3 గంటల తర్వాత పునరుద్ధరించింది. ఇన్‌స్టాగ్రామ్ సైతం కిసాన్ ఏక్తా మోర్చా పేజీలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన సాగిస్తున్న హిమ్మత్‌సింగ్ అనే రైతు సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రసార మాధ్యమాలు వివక్ష చూపుతున్నాయని, వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆరోపించారు. అందుకే సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు నిజాలు తెలియజేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment