
ఢిల్లీ: రైతు సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏ విషయాల్లో కేంద్రం చట్టాలు చేయవచ్చనేదాన్ని రైతులకు లేఖ ద్వారా తెలిపామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానాలో కాంట్రాక్టు వ్యవసాయం జరుగుతుందని, అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేవని తెలిపారు. విద్యుత్ బిల్లులు నష్టం కలిగిస్తాయన్న అంశంపై కూడా రైతులకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర వైఖరిని లిఖిత పూర్వకంగా రైతులకు అందజేశామన్నారు.
గురువారం నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. "కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాలు పునరాలోచించుకోవాలి. రైతు సంక్షేమం కోసం కేంద్రం లక్ష కోట్ల ప్యాకేజీకి సిద్దమైంది. గ్రామాలను, వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్బర్ చేసినప్పుడే దేశం ఆత్మనిర్బర భారత్ అవుతుంది. వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతు సంఘాలు చర్చలకు ముందుకు రావాలి" అని కోరారు. (చదవండి: రైతు ఆందోళనలు: కేంద్రం ప్రతిపాదనలు)
కాగా, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా మంగళవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. వీరితో కేంద్రం జరుపుతున్న చర్చలు సఫలీకృతం కావడం లేదు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం నిరాకరిస్తుండగా, సవరణలు చేస్తామని చెప్పింది. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. (చదవండి: ఉద్యమం ఉధృతం వెనుక కారణాలు.. డిమాండ్లు)
Comments
Please login to add a commentAdd a comment