సాగు చట్టం ప్రతులను దహనం చేస్తున్న రాకేశ్ తికాయత్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హోలికా దహనం నిర్వహించారు. కొత్త చట్టాల ప్రతులను ఆదివారం హోలీ మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అలాగే కనీస మద్దతు ధరపై మరో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) బచావో దివస్‌గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ అధికారులను ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కనీస మద్దతు ధర, ప్రజా పంపిణీ వ్యవస్థకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎఫ్‌సీఐకి నిధుల కేటాయింపులను ప్రతిఏటా భారీగా తగ్గిస్తోందని గుర్తుచేసింది. ఆందోళనలను అణచివేసేందుకు హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment