kisanmorcha
-
మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న పంజాబ్‌లోని 22 సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ఎస్కేఎం పేరు వాడుకోరాదని పేర్కొంది. కేవలం రైతు సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 475 వేర్వేరు సంస్థలతో ఏర్పడిన వేదిక ఎస్కేఎం కాగా, పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు అందులో ఒక భాగమని పేర్కొంటూ ఎస్కేఎం నేతలు దర్శన్ సింగ్ పాల్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఎస్కేఎం పేరును ఎవరైనా వాడుకుంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు వారు చెప్పారు. రైతుల ఇతర డిమాండ్లపై తదుపరి కార్యాచరణను జనవరి 15న ఖరారు చేస్తామన్నారు. పంజాబ్‌లో రైతు సంఘాల రాజకీయ వేదిక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు సాగించిన పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయ మార్పే లక్ష్యంగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి. పంజాబ్‌లోని మొత్తం 32 రైతు సంఘాలకు గాను 22 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పోటీ చేస్తామని భేటీ అనంతరం రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ మీడియాకు తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) నేత బల్బీర్ సింగ్ సింగ్ రాజేవాల్ తమ మోర్చాకు నేతగా ఉంటారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో ఎస్కేఎం పేరును మాత్రం వాడుకోబోమన్నారు. -
రైతు ధర్మాగ్రహ విజయం
దాదాపు 15 నెలల సుదీర్ఘకాలం... 700 మందికి పైగా రైతుల ప్రాణత్యాగం... ఎండనకా వాననకా, ఆకలిదప్పులను భరిస్తూ వేలాది రైతులు చూపిన ధర్మాగ్రహం... వృథా పోలేదు. రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అధికారిక లేఖ రూపంలో లిఖితపూర్వక హామీ దక్కింది. దాంతో, 3 నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలంటూ ఇన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు 40కి పైగా రైతు సంఘాలకు సారథ్యం వహిస్తున్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. అయితే, ‘ఆందోళనను విరమిస్తున్నామే తప్ప, ఉద్యమాన్ని విరమించడం లేదు. రైతు హక్కుల కోసం పోరు కొనసాగుతుంది’ అనడం గమనార్హం. జనవరి 15 దాకా గడువు పెట్టిన రైతులు, అప్పుడు ప్రభుత్వ హామీల పురోగతిని సమీక్షించి, కార్యాచరణ నిర్ణయించనున్నది అందుకే! ఏడాది పైగా ఇల్లూ వాకిలీ వదిలేసి, దేశ రాజధాని సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని ఉంటున్న రైతులు ఈ 11న విజయోత్సవ ర్యాలీతో స్వస్థలాలకు పయనం ప్రారంభిస్తారు. అయితే, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం లాంటి అన్నదాతల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరనే లేదు. రైతుల మొక్కవోని దీక్ష, ముంచుకొస్తున్న పంజాబ్ – యూపీ ఎన్నికలు... కారణం ఏమైతేనేం కేంద్రం తలొగ్గి, చటుక్కున రూటు మార్చి, వివాదాస్పద రైతు చట్టాలను ఉపసంహరించుకోవడం కనివిని ఎరుగని కథ. గురుపూర్ణిమ వేళ నవంబర్ 19న సాక్షాత్తూ ప్రధాని మోదీ రైతులకు టీవీలో క్షమాపణలూ చెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు తమ అనేక డిమాండ్లలో ఒకటి మాత్రమేనంటూ నిరసనను విరమించడానికి రైతులు ససేమిరా అన్నారు. ఆరు డిమాండ్లను ఏకరవు పెడుతూ ఎస్కేఎం నవంబర్ 21న ప్రధానికి లేఖ రాసింది. దానికి ప్రతిగా ఎస్‌కేఎంకు చెందిన అయిదుగురు సభ్యుల కమిటీకి కేంద్రం తన ముసాయిదా ప్రతిపాదనను బుధవారం పంపింది. రైతు సంఘాలు కోరిన మార్పులు చేర్పులతో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి లేఖ రూపంలో హామీ రావడంతో ఇప్పటికి రైతుల ఆందోళనకు తాత్కాలికంగా తెర పడింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సహా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన మొదలుపెట్టిన సరిగ్గా 380వ రోజున రైతులు ఇంటి దారి పట్టనున్నారు. వెనక్కి తిరిగి చూస్తే, కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత 2020 జూన్‌లో 3 వివాదాస్పద వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను సర్కారు పార్లమెంట్లో పాస్ చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ, పంజాబ్ గ్రామాల్లో చెదురుమదురుగా మొదలైన నిరసనలు క్రమంగా వేడెక్కి, పొరుగున ఉన్న హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. గత ఏడాది నవంబర్ 25న వేలాది రైతులు ఢిల్లీకి ప్రదర్శనగా రావడం, వారిని అనుమతించక పోవడంతో రాజధాని ప్రధాన ప్రవేశమార్గాలను ఆందోళనకారులు అడ్డగించడం కనివిని ఎరుగని చరిత్ర. రాజధాని వెలుపలే గుడారాలు వేసుకొని, నిరసన చేస్తున్న రైతు సంఘాల వారితో కేంద్రం 11 విడతల చర్చలు జరిపి, చట్టాల్లో మార్పులు చేస్తామంది. కానీ, చట్టాల రద్దు ఒక్కటే తమకు సమ్మతమని పట్టుబట్టి, రైతులు అనుకున్నది సాధించారు. నిజానికి, ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేళ రైతు ఆందోళనకారుల ర్యాలీలో పోలీసులతో హింసాకాండ చెలరేగింది. రైతు నిరసన దోవ తప్పినట్టు అనిపించింది. ఆ పైన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌ను బలవంతాన ఖాళీ చేయించడం లాంటి వాటితో మళ్ళీ ఉద్యమం ఊపందుకుంది. క్రమంగా నిరసనల కేంద్రం పంజాబ్, హర్యానాల నుంచి పశ్చిమ యూపీకి మారింది. ఒక దశలో సుప్రీమ్ కోర్టు సైతం జోక్యం చేసుకొని, సాగు చట్టాలపై ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాల్సి వచ్చింది. తీరా ఆ సంఘం సుప్రీమ్‌కు సమర్పించిన నివేదిక ఇప్పటికీ వెలుగు చూడలేదన్నది వేరే కథ. ఆ మాటకొస్తే సాగు చట్టాలు చేస్తున్నప్పుడు కానీ, వాటిని నవంబర్ 29న రద్దు చేస్తున్నప్పుడు కానీ పార్లమెంటులో చర్చ లేకుండా మెజారిటీతో నోరు నొక్కేశారనే అప్రతిష్ఠ మోదీ సర్కారు మూటగట్టుకుంది. చనిపోయిన రైతులకు నష్టపరిహారం మాటెత్తితే, మృతుల వివరాలు మా దగ్గర ఉండవంటూ మళ్ళీ విమర్శల పాలైంది. చివరకిప్పుడు– ఎంఎస్పీపై వేసే సంఘంలో ఎస్కేఎం నేతలకూ చోటిస్తామనీ, రైతులందరిపైనా కేసులు ఎత్తి వేసేలా చూస్తామనీ, విద్యుత్ సవరణ బిల్లులోని సెక్షన్లలో రైతు నేతలను సంప్రదించి మార్పులు చేస్తామనీ కేంద్రం హామీలు ఇవ్వాల్సి వచ్చింది. లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి బర్తరఫ్ డిమాండ్ ఒక్కటీ మిగిలిపోయింది. నిరసనకారులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్రం మొదటే చెప్పినా, 2016 నాటి జాట్ రిజర్వేషన్ల ఆందోళనల వేళ ఇలాగే ఇచ్చిన హామీలు నెరవేరలేదని రైతులు అనుమానించారు. అందుకు వారిని తప్పుపట్టలేం. హోమ్ మంత్రి గత వారం ఫోన్ చేసి మరీ చర్చించాల్సి వచ్చింది. హామీలిచ్చినా, అధికారిక లేఖ కావాలని రైతులు కోరారంటే, పాలకులపై పేరుకున్న అనుమానాలు అర్థమవుతున్నాయి. అయితే, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టాలని భావిస్తూ వచ్చిన రైతుల అనుమానాలు, కష్టాలు ఇంతటితో తీరేవి కావు. వారి సందేహాలను నివృత్తి చేసి, ఈ దేశంలో రైతే రాజు అనే విశ్వాసం నెలకొల్పాల్సింది పాలకులే. అందుకు ఇకనైనా ఓ సమగ్ర వ్యవసాయ విధానం దిశగా నడవక తప్పదు. ఆ ప్రయాణానికి ప్రేరేపించగలిగితే అన్నదాతల ధర్మాగ్రహ విజయం అపూర్వమవుతుంది. -
తదుపరి కార్యాచరణ ఏంటి?
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద సమావేశం కానుంది. ఎంఎస్పీతోపాటు ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీపై చర్చించనున్నట్లు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శనివారం చెప్పారు. సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంట్లో పూర్తయ్యేదాకా రైతుల పోరాటం ఆగదని అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ వరకూ ప్రతిరోజూ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని విరమించుకోలేదని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు ప్రారంభించిన పోరాటానికి నవంబర్ 26న ఏడాది పూర్తి కానుంది. ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ పోరాట కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండబోదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 26న ఢిల్లీ శివార్లలోని నిరసన కేంద్రాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కేసులను ఉపసంహరించాలి: మాయావతి కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టాన్ని తీసుకురావాలని బహుజన సమాజ్‌పార్టీ అధినేత మాయావతి శనివారం డిమాండ్ చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. -
Farm Laws: రద్దు’ ఇప్పుడే ఎందుకు?
Reason Behind Farm Law Repeal In Telugu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఈ సమయాన్నే ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై ఈ నెల 26తో ఏడాది పూర్తవుతుంది. ఈలోగా తమ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) ప్రకటించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్ అంశంపై అనునిత్యం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికి వర్షాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరో నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను మరింతగా పెంచుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. డిసెంబర్ 23 దాకా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. రైతుల నిరసనలు, నల్ల చట్టాల అంశమే నిత్యం వార్తల్లో ఉంటే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్షాలూ ఎలాగూ దీన్ని అందిపుచ్చుకొని ప్రధానాస్త్రంగా చేసుకుంటాయి. వెరసి కాషాయ పార్టీపై ప్రజావ్యతిరేకత ప్రబలుతుంది. అందుకే బీజేపీ వ్యూహకర్తలు పట్టువిడుపులు ప్రదర్శించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సాగు చట్టాలు, పెట్రోధరల లాంటి అంశాలను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలకు ఎక్కితే అది కచ్చితంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రతికూల సంకేతాలను పంపుతుంది. ఇది కాషాయ దళానికి అభిలషణీం కాదు. ఏడాది కాలంగా ఏమీ పట్టించుకోకున్నా ఇప్పుడిక ‘సమయం’ లేదు కాబట్టే సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్రం మొగ్గుచూపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల ప్రధానాస్త్రాలు మూడింటి విషయంలోనూ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వానికి ‘దాటవేత’ ధోరణిని అధిగమించి ఎదురునిలిచి బదులిచ్చే వెసులుబాటు కలిగింది. ఎదురుదాడి ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల్లో తేడాకొట్టిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అన్నట్లుగా బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తూ గంటల వ్యవధిలో పోటీలు పడి ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడిదే అంశాన్ని పట్టుకొని బీజేపీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల నోరునొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మీ రాష్ట్రాల్లో వ్యాట్‌ను ఎందుకు తగ్గించట్లేదని ఎదురుదాడికి దిగుతుంది. ఇతర ఏ అంశాన్ని విపక్షాలు ప్రస్తావించినా బీజేపీ మాత్రం వ్యాట్ ఎందుకు తగ్గించలేదనే అంశాన్నే తెరపైకి తెస్తూ తప్పించకోజూస్తుంది. కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని సెంట్రల్ పూల్ కింద తక్కువగా చూపుతూ సెస్‌ల రూపంలో అధికంగా పిండుకుంటోంది. అసలే రాష్ట్రాలకు ఆదాయ వనరులు తక్కువని, కోవిడ్–19 వ్యాప్తితో రాబడి మరింత దెబ్బతిందని, ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గింపు సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. వ్యాట్ తగ్గింపు అంశాన్ని ప్రతిరోజూ హైలైట్ చేయడం ద్వారా ఇతర అంశాలను మరుగున పడేయడానికి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తప్పకుండా ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా ప్రజా వ్యతిరేకతను వీలైనంత తగ్గించుకొని, విపక్షాలకు అస్త్రాలేవీ లేకుండా చేయాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా ఉపశమనం సదుద్దేశంతో రైతుల మేలుకోరి మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చినా కొందరినీ ఒప్పించలేక వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈనెల 19న ప్రకటించారు. దేశానికి క్షమాçపణ చెప్పారు. ఉపసంహరణ æప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామన్నారు. రైతు ఆందోళనల్లో కీలక భూమిక పోషిస్తున్న జాట్లు 136 స్థానాలున్న పశ్చిమ యూపీలో బీజేపీయేతర ఓటును ఏకతాటిపైకి చేర్చకుండా చూసుకోవాలంటే రైతు చట్టాలను రద్దు చేయాలి. పంజాబ్ జనాభాలో 21 నుంచి 25 శాతం జాట్ సిక్కులు ఉన్నారు. ఇతర సిక్కుల్లోనూ రైతులే అధికం. వీరి ఆగ్రహాన్ని చల్లార్చాలి. ఈ రెండింటినీ బీజేపీ ఆశించింది. ఇప్పుడిక కాంగ్రెస్, మిగతా విపక్షాలు రైతు ఎజెండాపై ఇదివరకటిలా మోదీ సర్కారుపై ముప్పేట దాడికి దిగలేవు. ‘కనీస మద్దతు ధర’ అంశం ఇకపై ఇరుపక్షాల నడుమ సంఘర్షణకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఊరట విపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్‌తో (ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారీ) నిఘా పెట్టారని, ఫోన్లను ట్యాప్ చేశారని, దీనిపై ప్రభుత్వం విస్పష్టమైన సమాధానం ఇవ్వాలని విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేశాయి. సీనియర్ జర్నలిస్టులు కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. చట్టవిరుద్ధంగా తామేమీ నిఘా పెట్టలేదని, దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని మోదీ సర్కా రు సుప్రీంకోర్టులో వాదించింది. ఇందులోని నిజా నిజాలను నిగ్గుతేల్చడానికి మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సాంకేతిక నిపుణులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అంటే పెగాసస్‌పై కేంద్రానికి తాత్కాలిక ఊరట లభించినట్లే. విపక్షాలు దీన్ని లేవదీసినా అంశం కోర్టు పరిధిలో ఉందని, ఏమైనా ఉంటే సాంకేతిక కమిటీకి విన్నవించుకోవాలంటూ కేంద్రం చేతులు దులుపుకునే అవకాశం ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
26న రైతుల జాతీయ సదస్సు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమై 9 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 26న జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం ప్రకటించింది. ఇందులో స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిల నుంచి వందలాది రైతు సంస్థలు పాల్గొంటాయని పేర్కొంది. ఈ సదస్సుకు సంబంధించిన వేదిక వివరాలను త్వరలో చెబుతామని రైతు సంఘాల నేత ఒకరు చెప్పారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పరిష్కారం కోసం ప్రభుత్వం, రైతు నాయకుల మధ్య 10 రౌండ్ల చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నర్మదా బచావో ఆందోళన్ జరిగి 36 ఏళ్లు పూర్తవుతున్నసందర్భంగా ఆగస్టు 17న నర్మదా కిసాన్ మజ్దూర్ జన్ సంసద్ జరగనుంది. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు హాజరయ్యే అవకాశం ఉంది. -
హోలీ మంటల్లో ‘సాగు’ ప్రతులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హోలికా దహనం నిర్వహించారు. కొత్త చట్టాల ప్రతులను ఆదివారం హోలీ మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అలాగే కనీస మద్దతు ధరపై మరో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) బచావో దివస్‌గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ అధికారులను ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కనీస మద్దతు ధర, ప్రజా పంపిణీ వ్యవస్థకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎఫ్‌సీఐకి నిధుల కేటాయింపులను ప్రతిఏటా భారీగా తగ్గిస్తోందని గుర్తుచేసింది. ఆందోళనలను అణచివేసేందుకు హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. -
డిమాండ్లు తీర్చకుంటే ట్రాక్టర్ల పరేడ్
న్యూఢిల్లీ: ఈనెల 4న జరిగే చర్చల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చకపోతే 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీ వైపు ట్రాక్టర్లతో పెరేడ్ చేపడతామని 40 రైతు సంఘాల కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’హెచ్చరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రానందున తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. గణతంత్ర దినోత్సవం పెరేడ్ అనంతరం కిసాన్ పెరేడ్ పేరిట తమ ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని రైతు నేత దర్శన్ పాల్ సింగ్ చెప్పారు. ఈ పెరేడ్ సమయం, మార్గాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే కేఎంపీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ 6న ఉంటుందనీ, రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఇది రిహార్సల్ అని చెప్పారు. వచ్చేదఫా చర్చలపై ఆశతోనే ఉన్నామని, కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని రైతుసంఘ నేత అభిమన్యుకుమార్ తెలిపారు. తమ డిమాండ్ మేరకు సాగు చట్టాలు రద్దు చేయడం లేదా తమను బలవంతంగా ఖాళీ చేయించడం మాత్రమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ అని రైతు నేతలు తేల్చి చెప్పారు. తమ డిమాండ్లలో సగానికిపైగా ఆమోదం పొందాయని చెప్పడం అబద్ధమని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించడం అందరి హక్కని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అందువల్ల తాము శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని మరోనేత బీఎస్ రాజేవల్ చెప్పారు. ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా బిలాస్‌పూర్‌కు చెందిన సర్దార్ కశ్మీర్ సింగ్(75) శనివారం మొబైల్ టాయిలెట్లో ఉరి వేసుకుని తనువు చాలించారు. ఆయన వద్ద సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: రబీ సీజ్‌కు సంబంధించి రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఓటు రాజకీయాల కోసం పాకులాడుతోందని విమర్శించారు. రైతుల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు కనుమరుగవడం ఖాయమని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీని భవిష్యత్‌లో ప్రజలు ఓడిస్తారని అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లాలోని ప్రతీ గ్రామంలో రైతుల కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని అన్నారు. రైతుల కోసం నెలకు రెండుసార్లు గ్రీవెన్స్‌డే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న సన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీపై డీజిల్ అందజేయాలని కోరారు. విత్తనాల కోనుగోలు కోసం రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. దీని వల్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సులువుగా ఉంటుందని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారీల రాజ్యం నడుస్తోందని, దానిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంచందర్‌రావు, దొంగల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గెల్లా సత్యనారాయణ, నాయకులు కొర్లకుంట్ల గోవర్ధన్, చిలుకూరి రమేష్, నంద్యాల శ్రీను, కొండి ప్రభాకర్ పాల్గొన్నారు.