సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్.. ఇదో ఆదర్శ గ్రామం. గ్రామస్తుల ఐకమత్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని మార్గదర్శకంగా నిలుస్తోంది. అనేక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్న ఈ గ్రామంలో ఈసారి రైతులు సంఘంగా ఏర్పడి పంటకు ముందే మద్దతు ధర నిర్ణయించారు. ‘ఇక పంటకు మద్దతు ధర నిర్ణయించేది వ్యాపారులు కాదు.. మేమే’అంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పైగా పండించబోయే (మార్చిలో చేతికందే) పంటకు ముందే ధర ప్రకటించారు. ఈ మేరకు వ్యాపారులను గ్రామాలకు పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు.
వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎర్రజొన్న (గడ్డి విత్తనం) ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సాగవుతుంది. ఏటా తమ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ కష్టాలను అధిగమించేందుకు అంకాపూర్ లో రైతులంతా ఏకమయ్యారు. ఈ రబీ సీజనులో సుమారు 1,300 ఎకరాల్లో ఎర్రజొన్న పంటను సాగు చేయాలని నిర్ణయించారు. సుమారు 1,400 టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనాకొచ్చిన రైతులు.. విత్తన వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. తమ పంటకు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు.
15 మంది విత్తన వ్యాపారులు, సీడ్ కంపెనీలు ఈ గ్రామానికి వచ్చి వేలంలో పాల్గొనగా.. 200 టన్నుల చొప్పున ఏడుగురు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చిలో చేతికందే తమ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేసేలా విత్తన వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. పంట విలువలో పది శాతం మొత్తాన్ని అడ్వాన్సు రూపంలో తీసుకుని పంటను సాగు చేస్తున్నారు. తీరా పంట పండిన తర్వాత మార్కెట్‌లో ఆ ధర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయకుండా ముందు జాగ్రత్తగా పేరున్న వ్యక్తుల జమానతు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment