హెల్త్‌కార్డుల భారంపై ‘కార్పొరేట్’ బేరం
* వైద్య చికిత్సల ప్యాకేజీపై 40 శాతం అదనంగా పెంచాలని డిమాండ్
* మొదట్లో 25 శాతమే కోరిన ఆసుపత్రులు... ఓకే చెప్పిన సర్కారు
* తాజా డిమాండ్లపై ఉన్నతస్థాయి సమావేశానికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కార్డులపై కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకో మాట మారుస్తున్నాయి. కొత్త మెలికలు పెడుతున్నాయి. ప్యాకేజీలపై బేరమాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల హెల్త్‌కార్డులపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇంతకుముందు చేసిన డిమాండ్‌కు సర్కారు ఓకే అని చెప్పింది.
గతంలో ఆరోగ్యకార్డుల శస్త్రచికిత్స ప్యాకేజీని 25 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మొదట్లో ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ససేమిరా అంది. 10 లేదా 15 శాతానికి మించి పెంచబోమని స్పష్టం చేసింది. కానీ చర్చోపచర్చల అనంతరం చివరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్‌కు తలొగ్గింది. తాజాగా 25 శాతం సరిపోదని, 40 శాతం ప్యాకేజీ పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రులు కోరుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యకార్డుల అమలుకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయంపై తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది.
ఓపీకి ఉచిత సేవలపై ప్రతిష్టంభన
ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించగా... ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఔట్ పేషెం ట్లుగా వస్తే ఉచితసేవలు అందించడం చాలా కష్టమని, అవసరమున్నా, లేకున్నా ఉద్యోగులు ఆసుపత్రులకు విరివిగా వస్తే తమకు ఇబ్బంది ఏర్పడుతుందని, అందువల్ల అందుకు ఫీజు వసూలు చేస్తామని, దానికి అంగీకరించాలని యాజమాన్యాలు అంటున్నాయి.
ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి అవసరమైతే ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ అడు గు ముందుకు పడలేదు. మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్‌ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యా ల ప్రతినిధులు కోరుతున్నారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎంఆర్‌పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి చెల్లిస్తే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. శస్త్రచికిత్సల ప్యాకేజీ పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 200 కోట్లకు మించి ఖర్చు కాదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం.
‘దసరాకి కార్పొరేట్ చికిత్స అందించాలి’
ఉద్యోగులకు దసరా పండగలోపు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీఆర్‌టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిని సోమవారం కలసి కోరారు. ఉపాధ్యాయుల నుంచి ప్రీమియం గెజిటెడ్ స్కేలు వారు రూ. 200, మిగతావారు రూ. 150 చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.